Begin typing your search above and press return to search.

మాయావ‌తి మౌనం.. ఎవ‌రికి వ‌రం?

By:  Tupaki Desk   |   10 Jan 2022 9:30 AM GMT
మాయావ‌తి మౌనం.. ఎవ‌రికి వ‌రం?
X
దేశం మొత్తం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. దేశంలోనే అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు (403) ఉన్న రాష్ట్రమైన యూపీలో విజ‌యం సాధించ‌డం ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌కు ఎంతో అవ‌స‌రం. ఈ శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో గెలిచిన పార్టీకి.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ ప్ర‌భావం చూపే అవ‌కాశం క‌లుగుతుంది. కేంద్రంలో అధికారంలోకి రావాల‌నుకునే పార్టీల‌కు ఇది ప్ర‌యోజ‌న‌క‌రంగా మారుతుంది. అందుకే పార్టీల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా యూపీ ఎన్నిక‌ల‌పై ఆస‌క్తి చూపిస్తుంటారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే నెల 10 మొద‌లు మార్చి 7 వ‌ర‌కూ ఏడు ద‌శాల్లో ఆ రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ దాన్ని నిలబెట్టుకోవాల‌నే ప‌ట్టుద‌లతో ఉండ‌గా.. మిగతా పార్టీలు తిరిగి గ‌ద్దెనెక్కాల‌నే ధ్యేయంతో క‌నిపిస్తున్నాయి.

మాయావ‌తి మౌనం..

యూపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ రాక‌ముందే అక్క‌డి పొలిటిక‌ల్ వాతావ‌రణం వేడెక్కిన సంగ‌తి తెలిసిందే. గ‌త రెండు నెల‌ల నుంచి వివిధ పార్టీల నుంచి ఇత‌ర పార్టీల్లోకి చేరిక‌లు, ప్ర‌చార స‌భ‌లు, యాత్ర‌ల‌తో రాష్ట్రంలో సంద‌డి నెల‌కొంది. అయితే గ‌తంలో ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావ‌తి మౌనంగా ఉండ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఓ వైపు అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్‌, స‌మాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) త‌మ ఎన్నిక‌ల స‌మ‌రాన్ని ముమ్మ‌రం చేశాయి. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ మాయావ‌తి ఒకటి రెండు సార్లు విలేక‌ర్ల స‌మావేశంలో క‌నిపించ‌డం త‌ప్ప ఇంత‌వ‌ర‌కూ బ‌య‌ట‌కి రాలేదు. ఎన్నిక‌ల వ్యూహాల‌పైనా ఆ పార్టీ నేత‌ల‌తో ఆమె చ‌ర్చించిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌లపై బీఎస్పీ పెద్ద‌గా దృష్టి సారించ‌డం లేద‌ని, ఆ పార్టీ ఓట్లు చీలే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ఎవ‌రి ఖాతాలో..

ద‌ళితులు ఓటు బ్యాంకు బ‌లంగా ఉన్న బీఎస్పీ గ‌తంలో ద‌ళితులు, బ్రాహ్మ‌ణుల‌ను ఏకం చేసి ఒంట‌రిగా అధికారాన్ని కూడా చేప‌ట్టింది. కానీ మొద‌టి నుంచి బీజేపీకి బ్ర‌హ్మ‌ణుల మ‌ద్ద‌తు ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు బీఎస్పీకి అనుకూలురైన బ్రాహ్మ‌ణులు త‌మ వైపు చూస్తార‌ని బీజేపీ భావిస్తోంది. మ‌రోవైపు యూపీలో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్య‌త భుజాల‌కెత్తుకున్న ప్రియాంక గాంధీ క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఆ బ్రాహ్మ‌ణ ఓట్ల‌లో చీలిక రావొచ్చ‌ని, బీజేపీ, కాంగ్రెస్‌కు ఆ ఓట్లు ప‌డొచ్చ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక బీఎస్పీ ఓటు బ్యాంకు అయిన ద‌ళిత ఓట్ల‌ను కాంగ్రెస్ ఏ మేర‌కు చీలిస్తుంద‌నే ఆస‌క్తి క‌లుగుతోంది. బీఎస్పీ కంటే ముందు కాంగ్రెస్‌కు ద‌ళితులు అండ‌గా నిలిచారు. ఈ నేప‌థ్యంలో తిరిగి వాళ్లు కాంగ్రెస్‌కే త‌మ మ‌ద్ద‌తు తెలుపుతారా? అన్న‌ది చూడాలి. ఒక‌వేళ అదే జ‌రిగిదే అప్పుడు ఎస్పీకి న‌ష్ట‌మ‌ని త‌ద్వారా త‌మ‌కు లాభిస్తుంద‌ని బీజేపీ అనుకుంటోంది.

అఖిలేష్ దూకుడు..

యూపీ ఎన్నిక‌లో ప్ర‌చారంలో ఎస్పీ అధినేత అఖిలేష్ దూకుడు కొన‌సాగిస్తున్నారు. బీజేపీకి ఓడించి అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌స‌ర‌మైన పార్టీల‌తో పొత్తు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. బీజేపీ, బీఎస్పీ నేత‌లు, ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చుకుంటున్నారు. తాను ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న పార్టీని గెలిపించే బాధ్య‌త తీసుకున్నారు. అంబేడ్క‌ర్‌వాదులు, బీసీలు క‌లిసిక‌ట్టుగా బీజేపీని తిప్పికొట్టాల‌ని ఆయ‌న ఇచ్చిన పిలుపున‌కు మంచి స్పంద‌న ల‌భించింది. దీంతో ద‌ళితుల‌ను ఆయ‌న త‌న వైపు తిప్పుకుంటున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. వివిధ వ‌ర్గాల‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న చిన్న చిన్న పార్టీల‌కు క‌లుపుకుంటూ ఆయ‌న ముందుకు సాగుతున్నారు. దీంతో ఇప్పుడు అఖిలేష్‌ను బీజేపీ ల‌క్ష్యంగా చేసుకుంది.