Begin typing your search above and press return to search.

ఒక్కసారిగా యాక్టవ్ అయిన మాయావతి

By:  Tupaki Desk   |   28 Jan 2022 4:48 AM GMT
ఒక్కసారిగా యాక్టవ్ అయిన మాయావతి
X
ఇన్ని రోజులు చాలా సైలెంట్ గా ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఒకవైపు బీజేపీ మరోవైపు ఎస్పీల చీఫులు, కీలక నేతలు రోడ్డుషోలు, ర్యాలీలతో రాష్ట్రంలో తిరుగుతుంటే మాయావతి మాత్రం ఎక్కడా కనబడలేదు. అలాంటిది పై రెండు పార్టీలు అభ్యర్ధులను ప్రకటించటం మొదలుపెట్టిన తర్వాత మాయావతి క్రియాశీలకం కావటమే ఆశ్చర్యంగా ఉంది.

ఏ పార్టీ అయినా అభ్యర్ధిని నిర్ణయించేటపుడు, టికెట్ ప్రకటించేటపుడు చాలా లెక్కలను వేసుకుంటుందని తెలిసిందే. బీజేపీ అయినా, ఎస్పీ అయినా చేస్తున్నదిదే. ఇలాంటి సమయాన్నే మాయావతి కొన్ని నియోజకవర్గాల్లో తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మాయావతి దళితులు, బ్రాహ్మణులు, ముస్లింలపై బాగా ఆశలు పెట్టుకున్నారు. కొన్నిచోట్ల ఓబీసీలపైన కూడా నమ్మకం పెట్టుకున్నారు.

పై క్యాటగిరిల్లో బీజేపీ, ఎస్పీల తరపున ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ సామాజిక వర్గాలను వదిలేసి మాయావతి ఇతర సామాజికవర్గాల నేతలను రంగంలోకి దింపుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ, ఎస్పీలు యాదవులను దింపితే మాయావతి మాత్రం దళితులను పోటీ చేయిస్తోంది. అలాగే పై పార్టీలు దళితులకు టికెట్లిచ్చిన కొన్ని నియోజకవర్గాల్లో బీఎస్పీ మాత్రం ముస్లింలను రంగంలోకి దింపింది. ఇలాగే దాదాపు అన్నీ నియోజకవర్గాల్లోను ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులకు వ్యతిరేకంగా టికెట్లిచ్చి పోటీచేయిస్తోంది.

దీనివల్ల చాలా నియోజకవర్గాల్లో గందరగోళం మొదలైపోయింది. ఇదంతా మాయావతి కేవలం బీజేపీ లబ్దికోసమే చేస్తోందని ఎస్పీ నేతలు ఆరోపిస్తున్నారు. నరేంద్ర మోడీకి అనుకూలంగానే మాయావతి ఎన్నికల ప్రక్రియను గందరగోళం చేస్తున్నారంటు ఎస్పీ అధినేత అఖిలేష్ మండిపోతున్నారు. సరే ఎన్నికలన్నాక ప్రత్యర్ధులను దెబ్బకొట్టేందుకు ఒక్కక్కొరిది ఒక్కో పంథా. మరి చివరి నిముషంలో మాయావతి యాక్టివ్ అవటం వెనుక ప్లాన్ ఎవరికీ అర్ధం కావటంలేదు.

బీఎస్పీ అధికారంలోకి వస్తుందా రాదా అన్నది అప్రస్తుతం. అయితే బీఎస్పీకి సుమారు 13 శాతం ఓట్లుండటం మాత్రం వాస్తవం.