Begin typing your search above and press return to search.

మధుర తగలెడుతుంటే హేమమాలిని ఏం చేసిందో తెలుసా?

By:  Tupaki Desk   |   3 Jun 2016 3:14 PM IST
మధుర తగలెడుతుంటే హేమమాలిని ఏం చేసిందో తెలుసా?
X
ప్రజాసేవ చేస్తామంటూ తెగ ఉత్సాహంగా వచ్చే సెలబ్రిటీలు రాజకీయంగా ఎంతలా సేవ చేస్తారో చాలామంది ప్రముఖులు చేతల్లో చేసి చూపించారు. పదవిని హోదాగా ఎంజాయ్ చేయటమే తప్పించి.. బాధ్యతగా ఫీల్ కాని ప్రముఖులు ఎలా వ్యవహరిస్తారన్న విషయం తాజా ఉదంతంతో మరోసారి నిరూపితమైందని చెప్పాలి. పార్కుకు సంబంధించిన భూమిని ఆక్రమించిన వారిని తొలగించే ప్రయత్నంలో ఉత్తరప్రదేశ్ లోని మధురలో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగటం తెలిసిందే.

కోర్టు ఆదేశాల మేరకు భూఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేసిన పోలీసులపై నిరసనకారులు దాడులకు దిగటంతో పెద్ద ఎత్తున హింసాకాండకు దారి తీసింది. ఈ ఘటనలో ఒక ఎస్పీ.. ఒక ఎస్ ఐతో సహా మొత్తం 21 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దాదాపు 200 పైగా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంత ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంటే.. ఆ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ సినీ నటి హేమమాలిని ఏం చేస్తున్నారో తెలుసా? ఒక షూట్ లో బిజీగా ఉన్నారట.

ఓపక్క మధుర తగలబడిపోతుంటే.. హేమమాలిని మాత్రం ఇవేం పట్టకుండా తన షూట్ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారట. ఈ విషయంపై ఒక న్యూస్ ఏజెన్సీ వార్తగా వెలుగులోకి తీసుకురావటం.. అప్పటికే సోషల్ మీడియాలో హేమమాలిని వైఖరిపై తీవ్రనిరసన వ్యక్తం కావటంతో హేమమాలిని తాను చేసిన తప్పును గుర్తించారు. వెంటనే.. తన పోస్టింగ్స్ ను తొలగించి.. మధుర ప్రజలు శాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏ పని చేసుకునే వారు ఆ పని చేసుకుంటేనే ఉత్తమన్న విమర్శలు హేమమాలిని లాంటి వారి పుణ్యమా అనే పుడతాయి మరి.