Begin typing your search above and press return to search.

ఎయిర్ ఇండియాపై భారీ సైబర్ దాడి.. 45 లక్షల మంది డేటా చోరీ

By:  Tupaki Desk   |   22 May 2021 1:00 PM IST
ఎయిర్ ఇండియాపై భారీ సైబర్ దాడి.. 45 లక్షల మంది డేటా చోరీ
X
భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై హ్యాకర్లు భారీ సైబర్ దాడికి పాల్పడ్డారు. భారీ స్థాయిలో డేటా చోరీకి పాల్పడ్డారు. ఎయిర్ ఇండియా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఎయిర్ ఇండియాపై సైబర్ దాడులు కలకలం రేపుతోంది. ఈ దాడుల్లో పదేళ్లలో ప్రయాణికులకు సంబంధించిన పూర్తి సమాచారం బయటకు వచ్చింది.

ప్రయాణికుల సేవల సంస్థ ‘ఎస్ఐటీఏ’పై ఫిబ్రవరిలో సైబర్ దాడులు జరగడంతో కొంతమంది ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్టు శుక్రవారం ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికుల వివరాలకు తగిన భద్రత ప్రమాణాలు పాటించామని పేర్కొంది.

2011-2021 ఫిబ్రవరి 3 వరకు పదేళ్లలో ప్రయాణికులకు సంబంధించి పుట్టినతేది, మొబైల్ నంబర్, పాస్ పోర్టు, టికెట్, క్రెడిట్ కార్డుల వివరాలు సహా వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్టు ఎయిర్ ఇండియా తెలుపడం ప్రయాణికులను షాక్ కు గురిచేసింది. దీని ప్రభావం 45 లక్షల మంది ప్రయాణికులపై పడిందని వివరించింది.

కాగా సైబర్ దాడులు జరిగిన మూడు నెలల తర్వాత ఎయిర్ ఇండియా ఈ వివరాలు తెలుపడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ‘డేటా ప్రాసెసర్ పై చర్యలు చేపడుతున్నాం. ప్రయాణికులు తమ పాస్ వర్డ్ లు మార్చుకోవాలని కోరుతున్నాం’ అని చావుకబురును ఎయిర్ ఇండియా చల్లగా చెప్పింది.

ఎయిర్ ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు ఎయిర్ లైన్స్ కు సంబంధించిన ప్రయాణికుల సమాచారం లీక్ అయినట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. స్విట్జర్లాండ్, సింగపూర్ ఎయిర్ లైన్స్, లుఫ్తాన్సా, జెనీవా లకు సంబంధించిన ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్టు ఎయిర్ ఇండియా తెలిపింది.