Begin typing your search above and press return to search.

ఆ దేశంలో మాస్కు అక్కర్లేదు.. టీకా సర్టిఫికేట్ తో పని లేదట

By:  Tupaki Desk   |   23 Jan 2022 9:30 AM GMT
ఆ దేశంలో మాస్కు అక్కర్లేదు.. టీకా సర్టిఫికేట్ తో పని లేదట
X
ఒకవైపు కరోనా మూడో వేవ్ తెగ ఇబ్బంది పెట్టేస్తున్న వేళ.. పలు దేశాలు పెడుతున్న ఆంక్షలు అన్ని ఇన్ని కావు. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మహమ్మారి దెబ్బకు దేశాలకు దేశాలు అతలాకుతలమైపోతున్న వేళ.. తాజాగా బ్రిటన్ ప్రభుత్వం మాత్రం మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించింది. వచ్చే గురువారం నుంచి (మరో నాలుగు రోజుల తర్వాత నుంచి) మాస్కు పెట్టుకోవాల్సిన అవసరం లేదేని తేల్చేసింది.

ఇప్పటివరకు బయటకు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ముఖానికి మాస్కు తప్పనిసరిగా నిబంధన ఉండేది. గురువారం నుంచి ఈ కీలక నిబంధన తొలిగిపోనుంది. అంతేకాదు.. పెద్ద పెద్ద కార్యక్రమాలకు హాజరయ్యే వారంతా టీకా సర్టిఫికెట్ తప్పకుండా తీసుకురావాలన్న నిబంధన కూడా ఎత్తేయనున్నారు.

దీనికి కారణం.. బ్రిటన్ లో ఒమిక్రాన్ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకోవటం.. అంటే ఇక కేసులు మరింత పెరగటానికి ఎలాంటి అవకాశం లేని స్థాయికి చేరుకోవటమే కారణంగా చెబుతున్నారు. అంటే.. దేశంలోని వారందరిని దాదాపుగా కలియబెట్టేసినట్లుగా చెప్పాలి. ఈ కారణంతోనే కీలకమైన కరోనా నివారణ ఆంక్షలైన మాస్కులు పెట్టుకోవటం.. కరోనా టీకా సర్టిఫికేట్ అవసరం లేని పరిస్థితి ఆ దేశానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.

అంతేకాదు.. రానున్న గురువారం నుంచి స్కూళ్లకు మాస్కులు ధరించాలన్న నిబంధనను ఆ దేశంలో ఎత్తి వేయనున్నారు. ప్రజలు వర్కుఫ్రం హోం చేయాల్సిన అవసరం లేదని చెప్పటం ఆసక్తికరంగా మారింది. అయితే.. బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా స్కాట్లాండ్ డిప్యూటీ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ మాత్రం.. తమ ప్రాంతంలో మాత్రం కరోనా వ్యాప్తి నివారణకు మాస్కును ధరించటం తప్పనిసరి అన్న నిబంధనను కొనసాగిస్తామని పేర్కొనటం గమనార్హం.

ప్రభుత్వ వర్గాలు అందిస్తున్న గణాంకాల్ని చూస్తే.. దేశమంతా ఒమిక్రాన్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న విషయాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. హౌస్ ఆఫ్ కామన్స్ కు తెలియజేశారు. తీవ్ర నిబంధనల నుంచి స్వల్ప నిబంధనల దిశగా వెళ్లేందుకు కేబినెట్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. దేశంలో ఆసుపత్రుల్లో ఆడ్మిషన్లు తగ్గిపోయాయని.. ఐసీయూ ఆడ్మిషన్లు కూడా పడిపోయిన వైనాన్ని వెల్లడించారు. సెల్ఫ్ ఐసోలేషన్ లాంటి కొన్ని నిబంధనలు మాత్రం కొనసాగుతాయని పేర్కొన్నారు. సెల్ఫ్ ఐసోలేషన్ సమయాన్ని ఏడు రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించినట్లుగా పేర్కొన్నారు. పాండమిక్.. ఎండమిక్ (ముగింపు దశ) కు చేరుకుందని.. అయిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఒమిక్రాన్ పుణ్యమా అని స్వల్ప లక్షణాలతోనే కరోనా ముగింపు దశకు చేరుకున్న వైనాన్ని బ్రిటన్ ప్రధాని చెప్పేసినట్లుగా చెప్పాలి.