Begin typing your search above and press return to search.

ఇకపై.. వీరంతా పెద్దలు బాస్

By:  Tupaki Desk   |   23 April 2016 4:47 AM GMT
ఇకపై.. వీరంతా పెద్దలు బాస్
X
నిన్నమొన్నటివరకూ వారిని రకరకాలుగా వ్యవహరించి ఉండొచ్చు. కానీ.. ఇకపై వారంతా ‘పెద్దలు’. పెద్దల సభకు మోడీ సర్కారు తాజాగా ఆరుగురిని నామినేట్ చేసింది. పెద్దల సభగా చెప్పే రాజ్యసభలో మొత్తం 12 నామినేటెడ్ సభ్యులు ఉండగా.. వీరిలో ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఆరింటిని భర్తీ చేస్తూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

పార్టీకి ఎంతోకాలంగా సేవ చేయటంతో పాటు.. పార్టీని వ్యూహాత్మకంగా మరింత బలోపేతం చేసే క్రమంలో భాగంగా తాజా ఎంపిక జరిగిందన్న విషయం జాబితాను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. గత ఎన్నికల్లో అరుణ్ జైట్లీకి అవకాశం ఇచ్చి త్యాగం చేసినందుకు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకి ఫలం దక్కింది. ఇక.. ఈశాన్య రాష్ట్రాల్లో పట్టు పెంచాలని.. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈశాన్య కమలనాథులకు కోటగా మార్చాలన్న మోడీ ఆలోచనలకు తగ్గట్లు ప్రముఖ బాక్సర్.. ఒలంపిక్ విజేత మేరీకాంను ఎంపిక చేశారు. ఇక.. మలయాళ నటుడు సురేశ్ గోపీని పెద్దల సభకు నామినేట్ చేశారు.

కేరళలో బీజేపీని మరింత బలోపేతం చేసే పనిలో భాగంగా సురేశ్ గోపీ ఎంపిక జరిగినట్లుగా చెప్పొచ్చు. వీరితో పాటు ప్రముఖ పాత్రికేయుడు స్వపన్ దాస్ గుప్తా.. ఆర్థికవేత్త నరేంద్ర జాదవ్ ను నామినేట్ చేస్తూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీని తన మాటలతో చీల్చి చెండాడుతూ.. గాంధీ ఫ్యామిలీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా షాకులిచ్చే బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామిని పెద్దల సభకు పంపటం ద్వారా.. పెద్దల సభలో బీజేపీ గొంతును మరింత బలంగా వినిపించే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే.. ఖాళీగా ఉన్న మరోస్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు.. హిందుత్వ వాదాన్ని జాతీయ స్థాయిలో బలంగా వినిపించే అనుపమ్ ఖేర్ ను నామినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.