Begin typing your search above and press return to search.

మేరీ కోమ్ చేసిన పని తెలిస్తే.. ముచ్చమటలు పోయాల్సిందే

By:  Tupaki Desk   |   22 March 2020 6:50 AM GMT
మేరీ కోమ్ చేసిన పని తెలిస్తే.. ముచ్చమటలు పోయాల్సిందే
X
వణికించే కరోనా అంతకంతకూ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా? ఈ వైరస్ మీద ఇంత అవగాహన ఉన్న తర్వాత కూడా ఎందుకిలా జరుగుతుంది? అన్న ప్రశ్న చాలామందిలో కలుగుతుంది. తాజా ఉదంతం గురించి తెలిసినంతనే మైండ్ బ్లాక్ కావటమే కాదు.. అలాంటి ప్రముఖులు సైతం ఇలాంటి దారుణమైన తప్పులు చేస్తారా? అన్న సందేహం కలుగక మానదు.

ఒలింపిక్ విజేతగా.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ గా మాత్రమే కాదు పద్మభూషణ్ గ్రహీత అయిన ప్రముఖ బాక్సర్ మేరీ కామ్ చేసిన తప్పు గురించి తెలిస్తే వణకాల్సిందే. కరోనా వేళ.. విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా సరే.. పద్నాలుగు రోజుల పాటు స్వీయ నిర్బందంలో ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన మార్గదర్శనాలు చాలా కచ్ఛితంగా ఉన్నప్పటికి.. ఆ విషయాల్ని పట్టించుకోకుండా వ్యవహరించిన వైనం తాజాగా బయటకువచ్చింది.

ఈ నెల మూడు నుంచి పదకొండు వరకూ జోర్డాన్ లో ఆసియా క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నీలో మేరీకోమ్ పాల్గొన్నారు. ఈ టోర్నీ నుంచి వచ్చిన తర్వాత బాక్సర్లు రెండువారాలపాటు హౌస్ క్వారంటైన్ లో ఉండాలి. దీనికి సంబంధించిన వివరాల్ని బాక్సింగ్ సమాఖ్య ముందే చెప్పింది. దీన్నిజట్టు సభ్యులంతా తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు కూడా. కానీ.. ఆమె మాత్రం ఈ నెల 18న రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన విందుకు హాజరయ్యారు.

దీనికి సంబంధించిన ఫోటో రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతాలో దర్శనమిస్తుంది. దీంతో.. మేరీకోమ్ చేసిన బాధ్యతారాహిత్యమైన పనిని పలువురు తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాను చేసిన పనిని మేరీకోమ్ సమర్థించుకునే పని చేయటం గమనార్హం. తాను నిబందనల్ని ఉల్లంఘించలేదని.. జోర్డాన్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉన్నానని.. ఒక్క రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమానికి మాత్రమే వెళ్లినట్లు చెప్పారు.

ఏ తప్పు అయితే చేయకూడదో ఆ తప్పు చేయటమే కాదు.. తాను ఆ ఒక్క పనే చేశానని చెప్పుకునే తీరుతో విస్మయానికి గురి కావాల్సిందే. ఇదే కార్యక్రమానికి హాజరైన ఎంపీ దుష్యంత్ సింగ్ ను తాను కలవలేదని.. షేక్ హ్యాండ్ ఇవ్వలేదని చెబుతున్నారు. జోర్డాన్ నుంచి వచ్చిన తర్వాత విధించిన స్వీయ నిర్భందం ముగిసినా.. మరో మూడు రోజులు తాను ఇంట్లోనే ఉంటానని చెబుతోంది. చేయాల్సింది చేసిన తర్వాత.. ఇప్పుడు ఏం చెబితే మాత్రం ఏం లాభం. కరోనా నేపథ్యంలో.. రాష్ట్రపతి.. ప్రధానమంత్రి లాంటి ప్రముఖులు తాము పాల్గొనే కార్యక్రమాల్లో హాజరయ్యే వారెవరూ.. విదేశాల నుంచి ఇటీవల కాలంలో వచ్చిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? అన్న అంశాన్ని వారి వ్యవహారాలు చూసే అధికారులు క్రాస్ చెక్ చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం కాక మానదు.