Begin typing your search above and press return to search.

నష్టం అంటే ఏమిటో తెలీని ఆ కంపెనీకి కరోనాతో ఎంత షాక్ అంటే?

By:  Tupaki Desk   |   30 July 2020 9:45 AM IST
నష్టం అంటే ఏమిటో తెలీని ఆ కంపెనీకి కరోనాతో ఎంత షాక్ అంటే?
X
కంపెనీ అన్నాక లాభాలు ఎంత కామనో.. నష్టాలు అంతే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. సదరు కంపెనీకి నష్టాలంటే ఏమిటో తెలీని పరిస్థితి. స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన పదిహేడేళ్ల కాలంలో నష్టాల మాటే తెలీని ఆ కంపెనీ తొలిసారి నష్టాల్ని మూటగట్టుకుంది. ఇంతకీ ఆ కంపెనీ ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. దేశీయ కార్ల మార్కెట్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే మారుతి సుజుకీ కరోనా వేసిన దెబ్బ అంతా ఇంతా కాదంటున్నారు. కంపెనీ చరిత్రలో తొలిసారి నస్టాలు మూటగట్టుకునేలా చేసింది.

సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి సదరు కంపెనీ రూ.1377 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాల్ని చూస్తే.. కరోనా పుణ్యమా అని తాజాగా ముగిసిన మొదటి త్రైమాసికానికి రూ.268 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని మూటగట్టుకుంది. కరోనా.. దాని వెంట వచ్చిన లాక్ డౌన్ కారణంగా భారీ ఆదాయాన్ని కోల్పోయింది మారుతి. ఏడాది క్రితం మారుతి ఇదే సమయానికి 4.02లక్షల వాహనాల్ని అమ్మితే.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కేవలం 67,027 వాహనాల్ని మాత్రమే అమ్మిన తీరు చూస్తే.. కరోనా మారుతి వ్యాపారాల్ని ఎంతలా దెబ్బ తీసిందో అర్థమవుతుంది.

కంపెనీ చరిత్రలోనే ఇదో అసాధారణ పరిణామంగా పలువురు అభివర్ణిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏప్రిల్ నుంచి జులై ముగిసే నాటికి కంపెనీ అతి తక్కువగా కార్లను ఉత్పత్తి చేసింది. సాధారణ సమయాల్లో రెండు వారాల్లో తయారు చేసే ఉత్పత్తికి.. కరోనా పుణ్యమా అని మూడు నెలల పట్టినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిని తామెప్పుడూ ఎదుర్కోలేదని చెబుతున్నారు. లాభాల లెక్కల కంటే కూడా ఉద్యోగుల ఆరోగ్యం.. భద్రతే తమకు ముఖ్యమని మారుతి చెబుతోంది. ఏమైనా.. నష్టమంటే ఏమిటో తెలీని కంపెనీకి అదేమిటి? అదెలా ఉంటుందన్నది పరిచయం చేసిన ఘనత మాత్రం మారుతిదే.