Begin typing your search above and press return to search.

డబ్బు మిగులుస్తున్న పెళ్లిళ్లు.!

By:  Tupaki Desk   |   18 May 2020 2:40 PM IST
డబ్బు మిగులుస్తున్న పెళ్లిళ్లు.!
X
ఇన్నాళ్లు పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూమి అంత చాపలు పరిచేసి కోట్లు ఖర్చు చేసి చేసేవారు. విందు, మందు, చుట్టాలు, పక్కాలు, వందలాది మందికి భోజనాలు.. పెద్ద పెద్ద సమూహాలతో అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఇప్పుడు మహమ్మారి దెబ్బతో పెళ్లిళ్లే కాదు.. పండుగలు, పబ్బాలను కూడా తక్కువ మందితో దగ్గరి స్నేహితులతోనే చేసుకునే ఖర్మ పడుతుంది. ఎందుకంటే ఎక్కువమందితో చేస్తే అది అంటుకుంటుంది. ఫంక్షన్ హాల్లు, సెట్టింగులకు కాలం చెల్లి సుబ్బరంగా గ్రామాల్లోనో.. ఏదైనా గెస్ట్ హౌస్ లోనో.. లేక సొంతిళ్లలో తక్కువ మందితో వేడుకలు చేసుకునే రోజులు రానే వచ్చాయి. లైఫ్ టైమ్ మెమొరీ అయిన పెళ్లిళ్లను ఇలా జరుపుకుంటామని.. అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు.

భారతీయుల్లో పెళ్లంటే ఒక జీవితకాలపు పెద్ద వేడుక. అందుకే లక్షలు ఖర్చు చేసి అంబానీల నుంచి మధ్య తరగతి వరకు పెళ్లిళ్లు చేస్తారు. ఇక లక్షలు సంపాదిస్తున్న యువత.. గ్రామాల్లోని వారు సైతం తమ పెళ్లిళ్లను సాదాసీదాగా జరుపుకోవడానికి అస్సలు ఇష్టపడడం లేదు. కట్నంతోనో..అప్పు చేసైనా ఘనంగా చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే పెళ్లి వేడుకలకు చేస్తున్న ఖర్చు చూస్తే.. భారతీయులు పెట్టినంతగా ఎవరూ పెట్టలేరేమో అన్నట్టుగా పరిస్థితి ఉంది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ పెళ్లిళ్లు కళ తప్పాయి. ఈ విపత్కర స్థితిలో ఎవరూ హంగూ ఆర్భాటాలకు పోవడం లేదు. ఇన్ని నిబంధనల మధ్య డబ్బున్న హీరోలు, నిర్మాతలు కూడా సాదాసీదాగా పెళ్లి చేసుకున్న పరిస్థితిని చూశాం. హీరో నిఖిల్, నిర్మాత దిల్ రాజులు బడా బాబులే అయినా 30 మందిలోపే బంధువులతో పెళ్లితంతును ముగించారు. సింపుల్ గా పెళ్లి కానిచ్చేశారు. దిల్ రాజు అయితే గుడిలో తాళి కట్టేశాడు.

ఇదంతా పెళ్లికొడుకులకు కాస్త నిరాశపరిచినా పెళ్లి చేసే అమ్మాయిల తల్లిదండ్రులకు మాత్రం గుండెల నిండా భారం దిగింది. పెళ్లి ఖర్చులు తగ్గి వారు ఊపిరి పీల్చుకుంటున్నారు. మినహాయింపుల తర్వాత కూడా పెళ్లిళ్లు ఇలానే జరిగే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే కోట్ల రూపాయలు మన భారతదేశానికి మిగులుతాయి. ఆ డబ్బులు ఇంకా దేనికైనా వినియోగించుకుంటే ఆర్థిక లోటు తగ్గిపోయే అవకాశాలు మెరుగవుతాయి.