Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను సెంటిమెంట్‌తో కొట్టారు...

By:  Tupaki Desk   |   5 April 2015 5:28 PM GMT
కేసీఆర్ ను సెంటిమెంట్‌తో కొట్టారు...
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ భ‌క్తి ... వాస్తును ఆయ‌న గౌర‌వించ‌డం అనే విష‌యంలో ఎవ్వ‌రికీ సందేహాలు లేనే లేవు. ఆయ‌న వాటికి ఎంత‌గా ప్రాధాన్యం ఇస్తారో అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ భ‌క్తి ఆధారంగానే ఆయ‌న్ను కౌంట‌ర్ చేసేందుకు కాంగ్రెస్ నేత‌లు సిద్ద‌ప‌డటం ఇందులో ట్విస్టు. కృష్ణా జ‌ల‌లు హైద‌రాబాద్ తాగునీటి అవ‌స‌రాల‌కు అనుసంధానించ‌డం అనే ప్ర‌క్రియ ఏళ్లుగా నానుతున్న విష‌యం తెలిసిందే. కృష్ణా మూడోద‌శ ప్రాజెక్టు నీటిని న‌గ‌ర తాగునీటికి అనుసంధానికి సీఎం అంగీకారం తెలిపారు. అయితే ఆ రోజు చంద్ర‌గ్ర‌హ‌ణం కావ‌డంతో ప్ర‌తిప‌క్షాలు దీని ఆధారంగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టేశాయి.


సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి ఈ విష‌యంలో కేసీఆర్ తీరును ప్ర‌శ్నించారు. హిందువుల ఆచారం ప్రకారం గ్రహణం అనేది శుభకార్యాలకు మంచిదికాదని ఆస్థాన పండితులు చెబుతున్నా...సీఎం కేసీఆర్ పట్టుదలకు పోయి కృష్ణాజలాల అనుసంధానం పనులు చంద్రగ్రహణం రోజునే చేయించడం దురదృష్టకరమని అన్నారు. సచివాలయానికి వాస్తు సరిగ్గాలేదని దానిని వేరేచోటుకు మార్చేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్...గ్రహణం రోజు కృష్ణాజలాల అనుసంధానం పనులు చేపట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.అదికూడా పండుగ పూట నీటిపరఫరా నిలిపివేసి మ‌రీ కొన‌సాగించారని మండిప‌డ్డారు.

మంచినీటి వినియోగం ఎక్కువగా ఉన్న హనుమాన్ జ‌యంతి, ఈస్టర్ పండుగ నాడు నీటి అనుసంధాన పనుల పేరుతో నీటిపరఫరాను నిలిపివేయడం సరికాదని శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. పండుగలను దృష్టిలో పెట్టుకుని రెండురోజులు పనులను వాయిదా వేయాలని తాను స్వయంగా హోంమంత్రి, జలమండలి ఎండీని కలిసి కోరినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ప్రజల మేలుకోసం ఎవరైనా మంచి సలహలు ఇస్తే స్వీకరిస్తానని చెబుతున్న సీఎం మాటలు కేవలం మాట‌ల వ‌ర‌కే పరిమితం అవుతున్నాయని విమర్శించారు. కృష్ణాజలాల రెండవదశ పనులను వేగవంతంగా పూర్తి చేయించింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని, మూడవదశ విషయంలో తాను, పీజేఆర్ కలిసి అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు.