Begin typing your search above and press return to search.

మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి పిల్ తో ఆగేదేమీ లేద‌ట‌!!

By:  Tupaki Desk   |   3 Oct 2018 4:43 AM GMT
మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి పిల్ తో ఆగేదేమీ లేద‌ట‌!!
X
తెలంగాణ‌లోని ఓట‌ర్ల జాబితాపై ప‌లు వ‌ర్గాలు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి అయితే.. మిగిలిన వారిలా కాకుండా ఆయ‌న‌కు ఆయ‌న‌గా సుప్రీంకోర్టులో ఇదే అంశంపై పిటీష‌న్ వేశారు. ఈ పిటీష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చి ఈ నెల 5న తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌న్న ఆదేశాల్ని జారీ చేసింది.

ఓప‌క్క ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కోసం భారీ ఎత్తున క‌స‌ర‌త్తు సాగ‌టం.. మ‌రోవైపు ఓట‌ర్ల జాబితాను ఫైన‌ల్ చేసే విష‌యంలో అధికారులు హ‌డావుడిగా ఉండ‌టం తెలిసిందే. ఎన్నిక‌ల‌కు సంబంధించి ఓట‌ర్ల జాబితాను ఫైన‌ల్ చేయ‌టం కీల‌కంగా మార‌టంతో అధికారుల దృష్టి మొత్తం ఆ అంశం చుట్టూనే తిరుగుతోంది.

మ‌రి.. ఓట‌ర్ల జాబితాలోని అవ‌క‌త‌వ‌క‌ల‌పై మ‌ర్రి శ‌శిధ‌ర్ వేసిన పిటీష‌న్ చూపించే ప్ర‌భావం ఎంత‌న్న‌ది ఇప్పుడో ప్ర‌శ్న‌. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మ‌ర్రి వేసిన సుప్రీం పిటీష‌న్ కార‌ణంగా ముంచుకొచ్చే ప్ర‌మాదం ఏమీ లేద‌ని చెబుతున్నారు. న్యాయ నిపుణులు.. రాజ‌కీయ వ‌ర్గాల వాద‌న ప్ర‌కారం ఏ రోజు అయితే ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వం అమ‌ల్లోకి వ‌చ్చిందో.. ఆ క్ష‌ణం నుంచే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చేసిన‌ట్లేన‌ని.. ఒక‌సారి ఎన్నిక‌ల ప్ర‌క్రియ షురూ అయితే..ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా ఆగే ప్ర‌స‌క్తే లేద‌ని బ‌ల్ల గుద్ది మ‌రీ వాదిస్తున్నారు.

అంత న‌మ్మ‌కంగా ఎలా చెబుతారు? సుప్రీంలో విచార‌ణ జ‌రుగుతుంది క‌దా? అన్న క్వ‌శ్చ‌న్ కు ఆన్స‌ర్ రెఢీగానే ఉంది. ఈ నెల 5న సుప్రీంలో మ‌ర్రి పిటీష‌న్ విచార‌ణ‌కు రానుంది. ఆ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌నుంది. దాదాపుగా ఆ రోజే కీల‌క నిర్ణ‌యం వెలువ‌డే వీలుందని తెలుస్తోంది. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ఓట‌ర్ల జాబితాపై పిటీష‌న్ వేసినంత‌నే ఎన్నిక‌ల్ని నిలుపుద‌ల చేసిన సంప్ర‌దాయం ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేద‌ని చెబుతున్నారు.

1952 నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల జాబితా అంశంతో ఎన్నిక‌లు వాయిదా ప‌డిన దాఖ‌లాలే లేవ‌ని.. అలాంట‌ప్పుడు మ‌ర్రి శ‌శిధ‌ర్ పిటీష‌న్ తో ఏదో జ‌రుగుతుంద‌న్న మాట ఉత్త భ్ర‌మ త‌ప్పించి మ‌రింకేమీ లేద‌ని చెబుతున్నారు. ఓట‌ర్ల జాబితాలోని లోపాల‌పై మ‌ర్రి సుప్రీంలో దాఖ‌లు చేసిన పిటీష‌న్ కాస్తంత హ‌డావుడి సృష్టిస్తుందే త‌ప్పించి.. మ‌రింకేమీ చేయ‌మ‌ని చెబుతున్నారు.

కోడ్ ఒక‌సారి అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఎన్నిక‌ల్ని ఆప‌టం అసాధ్య‌మ‌న్న మాట ప‌లువురి నోట వ‌స్తోంది. సో.. ఎన్నిక‌లు జ‌రిగే అంశాన్ని ప్ర‌భావితం చేసేలా మ‌ర్రి పిటీష‌న్ ఏమీ చేయ‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ వాద‌న‌లో నిజం ఎంత‌న్న‌ది కాలం చ‌క్క‌టి స‌మాధానం చెబుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.