Begin typing your search above and press return to search.

ఎపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సిత్రం మరోసారి కంటిన్యూ

By:  Tupaki Desk   |   13 Nov 2021 6:36 AM GMT
ఎపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సిత్రం మరోసారి కంటిన్యూ
X
రాజకీయాల్లో అదృష్టం చాలా ముఖ్యం. చేతికి వచ్చింది.. నోటికి చేరే వేళలోనూ చేజారిపోయే అవకాశాలు ఎక్కువ. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. అనుకున్నది దొరక్కపోవటం రాజకీయాల్లో తరచూ కనిపిస్తూ ఉంటుంది. కచ్ఛితంగా పదవులు పొందే అవకాశం ఉన్నా.. చివర్లో వచ్చి పడే అవాంతరాలు.. సమీకరణాల్లో చోటు చేసుకునే ఇబ్బందుల పుణ్యమా అని అనుకున్నది అనుకున్నట్లుగా చేయలేని పరిస్థితులు అప్పుడప్పుడు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా అలాంటి సీనే ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించింది.

తాజాగా జరుగుతున్న స్థానిక సంస్థలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎంపిక చేసింది. మొత్తం పద్నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు 50 శాతం ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. మైనార్టీలకు కేటాయింపులు జరిపారు. మిగిలిన స్థానాలు ఓసీలకు కేటాయింపులు జరిపారు.

ఈ అభ్యర్థుల జాబితాలో కచ్చితంగా ఉండే పేరుగా కొందరు.. మొదటి పేరు ఆయనదే అంటూ ప్రచారం జరిగిన సీనియర్ నేత మర్రి రాజశేఖర్ కు ఈసారి మొండిచేయి మిగిలింది. సదీర్ఘ విరామం తర్వాత ఆయనకు పదవి వస్తుందన్న ప్రచారం సాగింది. ఆయనకు ఎప్పుడు లక్ దగ్గరకు వచ్చినట్లే వచ్చి.. దూరమైపోతుంటుంది. గత ఎన్నికల్లో చిలుకలూరిపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి నిలవాల్సిన ఆయన.. చివరి నిమిషంలో టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన విడిదల రజనీ (బీసీ) ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో.. మర్రి రాజశేఖర్ కు అవకాశం త్రుటిలో మిస్ అయ్యింది.

దీనికి తోడు పార్టీ ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకున్న ఆయన.. తనకు అవకాశం లభిస్తుందని గడిచిన రెండున్నరేళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయన్ను ఎమ్మెల్సీగా చేసి తదుపరి మంత్రివర్గంలోకి తీసుకోవటం ఖాయమన్న ప్రచారం జరిగినప్పటికీ.. అందుకు భిన్నమైన పరిస్తితి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు రెండు స్థానాలు కేటాయించటం.. అందులో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటం.. టీడీపీ నుంచి పార్టీలోకి చేరిన మురుగుడు హనుమంతరావుకు వైసీపీ అవకాశం ఛాన్స్ లభించటంతో మర్రికి మొండిచెయి తప్పలేదు.

ఎమ్మెల్యేలు ఎన్నుకోవటం ద్వారా ఎమ్మెల్సీగా ఎంపిక కానున్న ముగ్గురు ఎమ్మెల్సీల్లో ఇద్దరి విషయంలో మాత్రం.. పార్టీ కోసం పని చేసిన వైనాన్ని చూసి ఇంప్రెస్ అయిన జగన్ వారిని అభ్యర్థులుగా ప్రకటించారని చెబుతున్నారు. గతంలో వీరిద్దరికి పదవులు ఇస్తానన్న మాట ఇచ్చి మరీ నిలబెట్టుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం నంద్యాల మార్కెట్ యార్డు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఇసాక్ బాషా..మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డి అనుచరుడిగా పేరుంది. రెండు దశాబ్దాలుగారాజకీయాల్లో ఉన్న ఆయన.. వైసీపీ పట్టణాధ్యక్షుడిగావ్యవహరిస్తున్నారు.

అధికారంలో లేనప్పుడు ఇసాక్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్న జగన్.. తాజాగా తన మాటను నిలబెట్టుకున్నట్లు చెబుతున్నారు. 2017లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చిన జగన్.. తాజాగా తన మాటను నిలబెట్టుకున్నారని చెప్పాలి. ఇక.. దేవసాని చిన్న గోవిందరెడ్డి విషయానికి వస్తే.. రోడ్డురవాణా సంస్థలో ఉప కమిషనర్ గా పని చేస్తున్న ఆయన.. వైఎస్ ప్రోత్సాహంతో తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో పార్టీలోకి వచ్చిన ఆయన.. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.

2009లో నియోజకవర్గం ఎస్సీ రిజర్వు కావటంతో ఆయన పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. 2009 ఎన్నికల్లో కమలమ్మ విజయంలో కీలకపాత్ర పోషించారు. 2019లోనూ డాక్టర్ వెంకట సుబ్బయ్యను అభ్యర్థిగా ఎంపిక చేస్తే..పార్టీ నిర్ణయానికి తగ్గట్లే ఆయన విజయానికి కీలకభూమిక పోషించారు. ఆయన అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యం కావటం.. ఆయన సతీమణి సుధకు టికెట్ కేటాయించారు. ఆ సందర్భంగానే గోవిందరెడ్డికి ఎమ్మెల్సీ కోటాలో అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లుగా చెబుతారు.ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఘన విజయం సాధించటంతో గోవిందరెడ్డి కీలక భూమిక పోషించినట్లు చెబుతారు. దీంతో.. ఆయనకు తాజాగా ఎమ్మెల్సీ అవకాశం తలుపు తట్టింది.

వైసీపీ ఎంపిక చేసిన అభ్యర్థులు వీరే
- ఇందుకూరు రాజు (విజయనగరం)
- వరుదు కళ్యాణి (విశాఖ)
- వంశీ కృష్ణయాదవ్ (విశాఖ)
- అనంత ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి)
- మొండితోక అరుణ్ కుమార్ (కృష్ణా)
- తలశిల రఘురామ్ (కృష్ణా)
- ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు)
- మురుగుడు హనుమంతరావు (గుంటూరు)
- తూమాటి మాధవరావు (ప్రకాశం)
- కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు)
- వై శివరామిరెడ్డి (అనంతపురం)
- ఇసాక్ బాషా (కర్నూలు)
- దేవసాని చిన్నగోవింద రెడ్డి (కడప)
- పాలవలస విక్రాంత్ (శ్రీకాకుళం)

జిల్లాల వారీగా చూస్తే.. మొత్తం 14 మంది అభ్యర్థుల్ని 11 జిల్లాలకు చెందిన వారు కాగా.. మిగిలిన మూడు జిల్లాలకు ఈసారి అవకాశం లభించలేదు. టికెట్లు కేటాయించిన 11 జిల్లాల్లో నాలుగు జిల్లాల(క్రిష్ణా.. విశాఖపట్నం.. గుంటూరు)కు ఇద్దరికి చొప్పున అవకాశం లభించటం విశేషం. విజయనగరం.. తూర్పుగోదావరి.. ప్రకాశం.. చిత్తూరు.. అనంతపురం.. కర్నూలు.. కడప.. శ్రీకాకుళం జిల్లాలకు మాత్రం ఒక్కొక్కరు చొప్పున మాత్రమే అవకాశం లభించింది.

జాబితాలో పేర్కొన్న మొదటి పదకొండు మంది స్థానిక సంస్థల ద్వారా ఎన్నుకోనున్నారు. చివరి ముగ్గురు మాత్రం ఎమ్మెల్యేలు ఎంపిక ద్వారా ఎన్నిక కానున్నారు. ఈ రెండు ఎన్నికల్లోనూ వైసీపీ బలం సంపూర్ణం కావటంతో మరెలాంటి ట్విస్టులు చోటు చేసుకోకుండా.. తదుపరి ఎమ్మెల్సీలు కానున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మండలిలో వైసీపీ బలం 32కు చేరుకోనుంది. ఇప్పటికే 18 మంది నేతలు అధికారపక్షానికి చెందిన వారు ఉండగా.. తాజాగా మరో 14 మంది మండలికి వెళ్లటం ఖాయం కావటంతో.. అధికారపక్ష బలం 32కు చేరుకోనుంది.