Begin typing your search above and press return to search.

మార్కులు త‌గ్గాయ‌ని బ‌ట్ట‌లు విప్పించారు!

By:  Tupaki Desk   |   2 Aug 2017 9:55 AM GMT
మార్కులు త‌గ్గాయ‌ని బ‌ట్ట‌లు విప్పించారు!
X
క్ర‌మ‌శిక్ష‌ణ‌, మెరుగైన మార్కుల కోసం విద్యార్థులకు టీచ‌ర్లు ర‌క‌ర‌కాల పనిష్ మెంట్స్ ఇస్తుంటారు. కానీ, ఈ మ‌ధ్య కాలంలో ప‌నిష్ మెంట్ల పేరుతో కొంత‌మంది టీచ‌ర్లు పైశాచిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఓ టీచ‌ర్... చిన్న‌పిల్ల‌ల‌ను దుస్తులు విప్ప‌దీసి గొడ్డును బాదిన‌ట్లు బాదిన వీడియో ఒక‌టి ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో ఉత్త‌రాఖండ్ లోని ఓ స్కూల్ లో మార్కులు త‌క్కువ‌గా వ‌చ్చిన విద్యార్థినుల‌కు అవ‌మాన‌క‌ర‌రీతిలో ప‌నిష్ మెంట్ ఇచ్చారు. త‌ర‌గ‌తి గ‌దిలో అంద‌రు విద్యార్థుల ముందు దుస్తులు విప్పించి తీవ్రంగా అవ‌మానించారు. ఉత్తరాఖండ్‌ లోని కస్బాలంగౌరాలో గల జేపీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్‌ లో ఈ ఘ‌ట‌న జరిగింది.

ఆ స్కూల్ లో 6వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థినులకు ఇంగ్లీషు టెస్ట్‌లో తక్కువ మార్కులు వ‌చ్చాయి. వారిద్ద‌రినీ విద్యార్థులందరి ముందు దుస్తులు విప్పాలని ఉపాధ్యాయులు బెదిరించారు. దీనికి విద్యార్థులు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో టీచర్లే బలవంతంగా వారి దుస్తులు విప్పారు. వారిని అలాగే బెంచీ మీద చాలా సేపు నిలబెట్టారు. పైగా విషయాన్ని ఎక్కడా చెప్పవద్దని ప్రథానోపాధ్యాయుడు బెదిరించాడని బాధిత‌ విద్యార్థినులు చెబుతున్నారు.

ఆ విద్యార్థినులు పాఠ‌శాల‌లో జ‌రిగిన‌ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతోవారు పాఠశాలకు చేరుకుని ఆందోళన ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వ‌ర్గాల‌తో చ‌ర్చించి పరిస్థితిని శాంతింపజేశారు. దీనిపై నివేదికను సమర్పించాలని జాయింట్ మెజిస్ట్రేట్.... జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు.