Begin typing your search above and press return to search.

షేర్ల షాక్:గంట‌లో 32 వేల కోట్లు న‌ష్ట‌పోయాడు

By:  Tupaki Desk   |   6 Feb 2018 2:03 PM GMT
షేర్ల షాక్:గంట‌లో 32 వేల కోట్లు న‌ష్ట‌పోయాడు
X
షేర్ మార్కెట్‌ లోని ఒకేవైపు చూసేవారికి...రెండో వైపు ఎంత షాక్ ఇచ్చేలా ఉంటుందో తెలియ‌జెప్పే ప‌రిణామం ఇది. అమెరికా స్టాక్ మార్కెట్ల పతనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 మంది బిలియనీర్లకు చెందిన లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసింది. ఈ సంపన్నులు సుమారు రూ.7 లక్షల 32 వేల కోట్లు నష్టపోయినట్లు బ్లూమ్‌ బర్గ్ అంచనా వేసింది. ఇందులో ఒక్క బిలియనీరే అత్యధికంగా సుమారు 500 కోట్ల డాలర్లు (సుమారు రూ.32 వేల కోట్లు) నష్టపోవడం గమనార్హం. ఆ కుబేరుడు ఎవరో కాదు.. బెర్క్‌ షైర్ హాథవే చైర్మన్ వారెన్ బఫెట్.

షేర్ మార్కెట్‌ ను ఆసాంతం అధ్య‌య‌నం చేసి పెట్టుబ‌డులు పెట్టి...లాభాలు ఆర్జించే వ్య‌క్తిగా పేరున్న బ‌ఫెట్‌ కు తాజా ప‌రిణామం దిమ్మ‌తిరిగే షాకిచ్చింది. కేవలం 24 గంటల వ్యవధిలో ఆయన ఇన్ని వేల కోట్ల సంపదను కోల్పోయారు. 9.2 శాతం మేర పతనమైన వెల్స్ అండ్ ఫార్గో కంపెనీలో మెజార్టీ వాటా బెర్క్‌ షైర్ కంపెనీదే కావడంతో బఫెట్ నష్టం భారీగా ఉంది. బఫెట్ తర్వాత ఫేస్‌ బుక్ సీఈవో మార్క్ జుకెర్‌ బర్గ్ 360 కోట్ల డాలర్లు (సుమారు రూ.23 వేల కోట్లు) నష్టపోయాడు. అటు ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కూడా సుమారు రూ.21 వేల కోట్ల సంపదను కోల్పోయారు. ఆల్ఫాబెట్ ఓనర్లు లారీ పేజ్ - సెర్గీ బ్రిన్‌ లు సుమారు రూ.15 వేల కోట్ల మేర నష్టపోయారు. 2011 ఆగస్ట్ తర్వాత డౌ జోన్స్ 1175 పాయింట్లు కోల్పోవడం ఇదే తొలిసారి అని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు.

మ‌రోవైపు మ‌న‌దేశంలోనూ ఇదే త‌ర‌హా షాకులు త‌గ‌లుతున్నాయి. కొన్ని నెలలుగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ.. కొత్త ఎత్తులకు వెళ్లిన సెన్సెక్స్ బడ్జెట్ తర్వాత భారీగా పతనమవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ట్రేడింగ్‌లో ఒక్కసారిగా 1200 పాయింట్లకుపైగా నష్టపోయింది. దీంతో రూ.5.4 కోట్ల విలువైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. 36 వేల పాయింట్ల మార్క్‌ను దాటి చరిత్ర సృష్టించిన సెన్సెక్స్.. తాజాగా 34 వేల పాయింట్ల మార్క్ కంటే కిందికి పడిపోయింది. మెటల్ - రియాల్టీ - కేపిటల్ గూడ్స్ - బ్యాంకింగ్ - ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ అన్నీ ఘోరంగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు కూడా సెన్సెక్స్‌ పై తీవ్ర ప్రభావం చూపించాయి. అమెరికా చరిత్రలో ఎన్నడూలేని విధంగా డౌ జోన్స్ దారుణంగా పతనమైన విషయం తెలిసిందే. ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని, అంతర్జాతీయ మార్కెట్ల పతనం మన మార్కెట్లపై ప్రభావం చూపినట్లు మార్కెట్ ఎక్స్‌ పర్ట్ గౌరంగ్ షా తెలిపారు. మిడ్ - స్మాల్ - మైక్రో క్యాప్ స్టాక్‌ లు మరింత పతనమయ్యే అవకాశం ఉన్నదనీ ఆయన చెప్పారు. ఆర్బీఐ రేపు క్రెడిట్ పాలసీ ప్రకటించనున్న నేపథ్యంలో మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉన్నట్లు వ్యాఖ్యానించారు.