Begin typing your search above and press return to search.

కట్జూసంచలనం.. మగాళ్లలో సెక్సు కోర్కెలు సహజం!

By:  Tupaki Desk   |   2 Oct 2020 1:40 PM IST
కట్జూసంచలనం.. మగాళ్లలో సెక్సు కోర్కెలు సహజం!
X
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ.. తనదైన మార్కు మాటల్ని మాట్లాడే జస్టిస్ మార్కండేయ కట్జూ తాజాగా మరోసారి స్పందించారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఉదంతంపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గ్యాంగ్ రేప్ ఘటనను తాను ఖండిస్తున్నట్లుగా పేర్కొన్న ఆయన.. దోషులకు కఠినమైన శిక్ష విధించాలన్నారు.

అయితే.. అత్యాచారాల వెనుక ఉండే కారణాల్నిఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. హత్రస్ గ్యాంగ్ రేప్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులకు కఠిన శిక్ష విధించాలని.. ఎన్ కౌంటర్ చేసేయాలన్న ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. అత్యాచారాలకు కారణమేమిటి? అన్న విషయంపై చర్చకు తెర తీశారు కట్జూ.

మహిళలపై అత్యాచారాలకు కారణం నిరుద్యోగమన్న ఆయన.. పలు అంశాల్ని ప్రస్తావించారు. పురుషుల్లో సెక్సుఅనేది సహజమైన కోరికని.. తిండి తర్వాత మనిషికి కావాల్సింది సెక్స్ అని కొన్నిసార్లు చెబుతుంటారన్నారు. భారత్ లాంటి సంప్రదాయక దేశాల్లో ఎవరైనా వివాహంతోనే సెక్సును పొందుతారు. దేశంలో నిరుద్యోగం ఎక్కువ అవుతున్న వేళ.. చాలామంది యువకులకు పెళ్లిళ్లు కావట్లేదు. నిరుద్యోగుల్ని అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకోరు కదా? అని ఆయన చెబుతున్నారు.

1947 కు ముందు అవిభాజ్య భారత్ లో 42 కోట్ల మంది జనాభా ఉంటే.. ఇప్పుడు అది నాలుగు రెట్లు పెరిగింది. ఒక్క భారత్ లోనే 135 కోట్లకు చేరుకుంది. పెరిగిన జనాభాకు తగ్గట్లు ఉద్యోగ అవకాశాలు పెరగటం లేదని.. ఒక్క 2020లోనే దాదాపు 12 కోట్ల మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారన్నారు. ఇలాంటప్పుడు అత్యాచారాలు పెరగకుండా ఉండగలవా? అని ప్రశ్నించారు. తాను అత్యాచారాల్ని సమర్థించటం లేదని..తీవ్రంగా ఖండిస్తున్నాని కట్జూ చెబుతున్నా.. ఆయన వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నారు.

అత్యాచారాలకు నిరుద్యోగం కారణమని సంకుచితను బయటపెట్టారని ఫైర్ అవుతున్నారు. కట్జూ వాదనలే తీసుకుంటే.. అందరికి గుర్తున్న దిశ ఉదంతాన్ని తీసుకుంటే.. అందులోని నిందితులకు ఆదాయ మార్గాలు ఉన్నాయి. మరింత వివరంగా చెప్పాలంటే.. అందరూ తాము చేసే పనికి పొందే ఆదాయం కంటే ఎక్కువగానే వారు సంపాదించిన విషయాన్ని మర్చిపోకూడదు. ఈ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటే.. అత్యాచారానికి.. నిరుద్యోగానికి లింకు లేదనే చెప్పాలి. నిర్భయ ఉదంతంలోని నిందితులు సైతం వివిధ పనులు చేసే వారే. ఈ లెక్కన చూసినప్పుడు మేధావి కట్జూ ఎక్కడో దారి తప్పినట్లుగా అనిపించట్లేదు?