Begin typing your search above and press return to search.

కశ్మీర్ కావాలంటే బిహార్‌నూ తీసుకోండి!

By:  Tupaki Desk   |   27 Sep 2016 7:45 AM GMT
కశ్మీర్ కావాలంటే బిహార్‌నూ తీసుకోండి!
X
తెలిసి చేస్తారో - తెలియక చేస్తారో తెలియదు కానీ సంచలన వ్యాఖ్యలు చేయడంతో తనకు తానే సాటి అని నిరూపించుకునే ప్రత్యత్నంలో నిత్యం పనిచేస్తుంటారు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ. తెలిసో తెలియకో మాట్లాడుతున్నారనుకుందామంటే... ఆయన మాజీ న్యాయమూర్తి అయిపోయారు. అన్నీ తెలిసే అంటున్నారనుకుందామంటే.. ఆ మాటలు పూర్తయిన వెంటనే జనాలు ఏకిపారేస్తున్నారు. గత విషయల సంగతి కాసేపు పక్కనపెడితే, తాజాగా పాక్ కు ఒక ఆఫర్ ప్రకటించారు కట్జూ. ఆ ఆఫర్ ఏమిటంటే.. పాక్ కు కశ్మీర్ కావాలంటే... బీహార్ ను కూడా తీసుకోవాలని!!

ఈ మాటలు వింటే ఏమనిపిస్తుంది? మిగిలిన వారికే ఆ స్థాయిలో కాలిపోతుంటే.. ఇక బీహారీల సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ముందు ఈయన్ని పాక్ కు తీసుకుపొండి అని కొందరంటుంటే.. బిహార్‌ను చులకనగా చూస్తున్నారని మరికొందరు అంటున్నారు. మరికొందరైతే ఈయనపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో పాకిస్థాన్‌ కు ప్యాకేజ్ డీల్‌ను ప్రకటించిన కట్జూ... "పాకిస్థానీలూ - మన వివాదాలకు ఇక శాశ్వతంగా తెర దించుదాం. మేం మీకు కశ్మీరు ఇస్తాం - కానీ ఒక షరతు ఉంది - మీరు కశ్మీర్ తో పాటు బిహార్‌‌ ను కూడా తీసుకోవాలి, ఇది ప్యాకేజీ డీల్" అని పేర్కొన్నారు.

ఈ ఆఫర్ కు చారిత్రాత్మక అంశాన్ని, సంఘటనను జతపరిచే ప్రయత్నం చేసిన కట్జూ... వాజ్‌ పేయి ప్రధానమంత్రిగా ఉన్నపుడు జరిగిన ఆగ్రా సదస్సులో ముషర్రఫ్‌ కు ఈ ఆఫర్‌ ను వాజ్‌ పేయి అప్పుడే ఇచ్చారని, తెలివితక్కువతనంతో ముషర్రఫ్ దానిని తిరస్కరించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని తీసుకుంటే మొత్తం ప్యాకేజ్‌ నే తీసుకోవాలని, లేకపోతే ఏదీ తీసుకోకూడదని అన్నారు.

ఈ విషయంపై వివాదం రేగడంతో... జస్టిస్ కట్జూ మరోసారి స్పందించారు. తాను నిజంగా పాకిస్థాన్‌ కు ఈ ఆఫర్ ఇవ్వలేదని, కేవలం జోక్ చేశానని, బిహారీలు హాస్య చతురతను పెంచుకోవాలని మరో పోస్ట్‌ లో రాశారు. గౌతమ బుద్ధుడు, చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు వంటి మహానుభావులు బీహార్ లోనే జన్మించారని, బీహారీలంటే తనకెంతో గౌరవమని పేర్కొన్నారు. అక్కడితో ఆగని కట్జూ మరో పోస్ట్‌ లో "పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఆఫర్‌ ను తిరస్కరించిందని, కశ్మీరును అడుగుతున్నందుకు క్షమాపణ చెప్పిందని" పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/