Begin typing your search above and press return to search.

జుకర్ బర్గుకు ఝలక్ తగిలింది

By:  Tupaki Desk   |   6 Jun 2016 9:04 AM GMT
జుకర్ బర్గుకు ఝలక్ తగిలింది
X
ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ పరిస్థితి గజ ఈతగాడు ఇంటెనక కాలువలో కొట్టుకుపోయాడన్నట్లుగా మారింది. తన ఖాతాదారుల అకౌంట్లను హ్యాకింగ్ ఫ్రీగా మార్చేందుకు పెద్దపెద్ద మాటలు చెప్పిన జుకర్ బర్గ్ సొంత అకౌంటే హ్యాకర్ల బారినపడింది. ఆయనకు చెందిన ఫేస్ బుక్ అకౌంట్ ఒక్కటే కాదు - ట్విట్టర్ - పింటరెస్టు - లింక్డిన్ - ఇన్ స్టాగ్రాం ఖాతాలనూ హ్యాకర్లు కొల్లగొట్టేశారు. దీంతో జుకర్ బర్గ్ పరిస్థితి శకునం చెప్పే బల్లే కుడితిలో పడినట్లుగా మారింది.

‘బగ్ బౌంటీ ప్రోగ్రాం’తో ఫేస్‌ బుక్ యూజ‌ర్ల అకౌంట్లు ఏ మాత్రం హ్యాకింగ్‌ కి గురి కాకుండా నెటిజ‌న్లే పెద్ద‌ ఎత్తున్న బ‌గ్‌ల‌ను క‌నిపెట్టేలా చేస్తూ ఫేస్ బుక్ చ‌ర్య‌లు తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. అయితే పేస్‌ బుక్ అధినేత జుకర్ బర్గ్ సోష‌ల్ మీడియా అకౌంట్లే ఇప్పుడు హ్యాకింగ్‌ కు గుర‌వడంతో సాధారణ ఖాతాల పరిస్థితేంటన్న సందేహాలు మొదలయ్యాయి. సౌదీ అరేబియాకు చెందిన ఓ హ్యాకింగ్ గ్రూపు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకునే ఫేస్‌ బుక్ అధినేత జుక‌ర్ బ‌ర్గ్ సోషిల్ మీడియా అకౌంట్ల‌పై అటాక్ చేసింద‌ట‌. జుక‌ర్ బ‌ర్గ్ కు చెందిన ఫేస్‌ బుక్ ఖాతా మాత్ర‌మే కాదు. ఆయ‌నకు చెందిన ఇన్ స్టాగ్రాం - లింక్డెన్ - పింటరెస్ట్ - ట్విట్టర్ ఖాతాల్లో కూడా హ్యాక‌ర్లు చొర‌బ‌డి వాటిని చెడ‌గొట్టేశార‌ట‌. జుక‌ర్‌ బ‌ర్గ్ త‌న‌ ఇన్ స్టాగ్రాం ఖాతాను తెరిచేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా అది తెరుచుకోవ‌డం లేద‌ట‌. జుక‌ర్ బర్గ్ అకౌంట్ల‌పై దాడి చేసిన అనంత‌రం హ్యాక‌ర్లు.. ‘జుక‌ర్ బ‌ర్గ్ సోష‌ల్ మీడియాలో వాడిన పాస్‌ వ‌ర్డ్ లు ఇవే’ నంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఆయనకు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి.

కాగా ఇప్పటికే తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకవ్వడంతో జుకర్ బర్గ్ అలర్టయిపోయారు. తన ఈమెయిల్ అకౌంట్‌ పై కూడా హ్యాకర్స్ దాడి చేసేందుకు రావొచ్చని అంచనా వేసి వాటిని మరింత భద్రంగా ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అయితే.. హ్యాకర్లు మాత్రం సోషల్ మీడియా అకౌంట్ల భద్రత ఎంత డొల్లో చెప్పడానికే ఏకంగా జుకర్ బర్గ్ అకౌంట్లు హ్యాక్ చేశామని చెబుతున్నారు.