Begin typing your search above and press return to search.

ఢిల్లీ వీధుల్లో ఫేస్ బుక్ సీఈవో అలా చేశాడు

By:  Tupaki Desk   |   29 Oct 2015 4:42 AM GMT
ఢిల్లీ వీధుల్లో ఫేస్ బుక్ సీఈవో అలా చేశాడు
X
ప్రపంచంలో కొం​దరు ఆ దేశం.. ఈ దేశం అన్న తేడా లేకుండా అందరికి సుపరిచితం​. దేశాలకు అతీతంగా వారిని విపరీతంగా ప్రేమిస్తుంటారు.. అభిమానిస్తుంటారు. యుక్త వయసులోనే వందల కోట్ల మంది మనసును దోచుకున్న వారిలో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడైన మార్క్ జుకర్ బర్గ్ ​ అలాంటి వారిలో ​ ఒకరు. తన మదిలో పుట్టిన ఫేస్ బుక్ ఆలోచనతో ప్రపంచంలో ఒక కొత్త ‘‘ప్రపంచాన్ని’’ ఆవిష్కరించటంలో ఆయన ఎంత విజయవంతం అయ్యారో చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి వ్యక్తితో మీటింగ్ కోసం కొందరు దేశాధ్యక్షులు సైతం వెయిట్ చేసే పరిస్థితి. అంతటి వీవీఐపీకి కాలం ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్షణం తీరిక లేకుండా ఉండే ఆయన ​ప్రస్తుతం ​
భారత్ లో పర్యటిస్తున్నారు.

తన పర్యటనలో తాజ్ మహల్ సందర్శన దగ్గర నుంచి ఢిల్లీ ఐఐ​టీయన్లతో భేటీ ఇలా పలు కార్యక్రమాల్లో ఆయన బిజీబిజీగా ఉన్నారు. ఇంత బిజీలోనూ ఆయన ఢిల్లీ రోడ్ల మీద తెల్లవారుజామున తిరగటం ఆశ్చర్యకరమే. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా పేరున్న ఢిల్లీ వీధుల్లో తన సహచరులతో కలిసి బుధవారం ఉదయం జాగింగ్ చేయటం.. ఆ ఫోటోను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేయటం పలువురిని విశేషంగా ఆకర్షించింది. ఫేస్ బుక్ సీఈవో లాంటి వీవీఐపీ.. ఢిల్లీ వీధుల్లో (ఇండియా గేట్ దగ్గర) చాలా సాదాసీదాగా పొద్దున్నే లేచి జాగింగ్ చేయటం చూసినప్పుడు.. కొన్ని విషయాలు​ ఆలోచింపజేస్తాయి.

అత్యుత్తమ స్థాయిలో ఉండి కూడా సింఫుల్ గా బతకటం ఒకటైతే.. హడావుడికి దూరంగా.. తన సహచరులతో ఉదయాన్నే జాగింగ్ చేయటం చూసినప్పుడు జీవితంలో వ్యాయామానికి.. ఆరోగ్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను జుకర్ బర్గ్ చెప్పకనే చెప్పేశారు.

నిజానికి జుకర్ బర్గ్ తానుండే స్టార్ హోటల్ లో వ్యాయామం చేసే వీలుంటుంది. కానీ.. అందుకు భిన్నంగా తాను పర్యటిస్తున్న దేశాన్ని.. అక్కడి ప్రజల్ని.. వారి జీవితాల్ని తానే ప్రత్యక్షంగా చూడాలని అనుకున్నారో? లేక.. ప్రభాతవేళ ఢిల్లీ అందాల్ని అస్వాదించాలని అనుకున్నారో? కానీ.. ఢిల్లీ వీధుల్లో ఆయన జాగింగ్ చేశారు. ఈ వైనం భారతీయుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అందుకు.. ఆయన ఫేస్ బుక్ పేజీల్లో లైకులు.. కామెంట్ల ‘లెక్క’ చూస్తేనే తెలుస్తుంది. తాజ్ మహల్ ను సందర్శించిన ఫోటోను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తే ఏకంగా 11 లక్షల మంది లైక్ చేస్తే.. 23 వేల మంది కామెంట్లు.. 22 వేల మంది షేర్లు చేసేశారు. అంతేకాదు.. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జాగింగ్ చేసిన ఫోటోను పోస్ట్ చేసిన ఐదు గంటల వ్యవధిలోనే లక్షకు పైగా లైక్స్ వెల్లువెత్తటం గమనార్హం.

ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. జుకర్ బర్గ్ లాంటి అత్యంత సంపన్నుడు.. వీవీఐపీ లాంటి వ్యక్తి ఢిల్లీ వీధుల్లో జాగింగ్ చేయటంలో ఒక విశేషం ఉంది. ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటనకు వచ్చినప్పుడు రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనటం తెలిసిందే. ఆ సందర్భంలో ఒబామా బహిరంగ ప్రదేశంలో అన్నేసి గంటలు ఉండటం కారణంగా ఆయన ఆయుష్షు ఎంత తగ్గుతుందో లెక్కలేసిన విషయాన్ని మర్చిపోలేం. ఢిల్లీ ఎంత పొల్యుషన్ సిటీ అన్న విషయాన్ని చెప్పేందుకు ఈ లెక్కలు వేసినోళ్లు ఉన్నారు. ఇలాంటి సమాచారం జుకర్ బర్గ్ లాంటి వారి దృష్టికి రాకపోదు. ఆయన సిబ్బంది ఆయనకు హెచ్చరించకుండా ఉండకపోరు. కానీ.. అవేమీ పట్టించుకోకుండానే ఢిల్లీ రోడ్ల మీద ఆయన జాగింగ్ చేసి కోట్లాది భారతీయుల మనసుల్ని టచ్ ​చేశారు.