Begin typing your search above and press return to search.

మరిస్సా గురించి ఎందుకు తెలుసుకోవాలి?

By:  Tupaki Desk   |   10 Dec 2015 5:30 PM GMT
మరిస్సా గురించి ఎందుకు తెలుసుకోవాలి?
X
గ్రాసరీ స్టోర్ లో క్లర్క్ గా పని చేసే ఒక మహిళ ప్రపంచంలో ప్రభావవంతమైన 22వ వ్యక్తిగా గుర్తింపు సాధ్యమా?
ఒక చిరుద్యోగిగా ఉన్న ఒక సాధారణ మహిళ అసాధారణ మహిళా మారతారా?

22 ఏళ్ల క్రితం చాలా తక్కువ జీతానికి పని చేసిన మహిళ వార్షిక జీతం రూ.250కోట్లు అయ్యే అవకాశం ఉందా?
ఇలాంటి ప్రశ్నలు వేస్తే.. చాలామంది సాధ్యం కాదని చెప్పేస్తారు. కానీ.. మరిస్సా మేయర్ గురించి తెలిసిన వారి పెదాల మీద మాత్రం పల్చని చిరునవ్వు విరుస్తుంది. ఒక సాధారణ మహిళ.. తన చుట్టూ ఉన్న అవకాశాల్ని గుర్తించి.. దానికి అనుగుణంగా తనను తాను మార్చుకొని.. కష్టాన్ని నమ్ముకొని అంచలంచెలుగా ఎదిగి.. ఒక అసాధారణ మహిళగా మారటానికి నిలువెత్తు రూపాన్ని ఇస్తే మరిస్సా మేయర్ అవుతారు. అద్యంతం ఆసక్తిని రేకెత్తించే ఆమెకు సంబంధించి ఆసక్తికర కోణాలెన్నో కనిపిస్తాయి.

అసలు ఎవరామె..?

విస్కాన్సిన్ అనే చిన్న నగరంలో జన్మించారు మరిస్సా. సాదాసీదా కుటుంబ నేపథ్యం ఉన్న ఆమె మామూలు విద్యనే అభ్యసించారు. 1995లో ఒక గ్రోసరీ షాపులో క్లర్క్ గా పని చేసేవారు. రోటీన్ జీవితం మీద విసుగెత్తిన ఆమె.. మిగిలిన వారికి భిన్నంగా ఆలోచించారు.

టర్నింగ్ పాయింట్..

ఆ రోజుల్లో ఇంటర్నెట్ అప్పుప్పుడే విస్తృతమవుతోంది. ఇదే సమయంలో ఆమె కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసించారు. అదే సమయంలో ఆమెకు గూగుల్ గురించి చెప్పారు. కొత్తగా పెట్టిన ఆ కంపెనీ ఉద్యోగుల కోసం వెతుకుతుందని ఆమెకు తెలిసింది. అలా వారి దగ్గరకు వెళ్లిన ఆమె గూగుల్ లో 20వ ఉద్యోగిగా అపాయింట్ మెంట్ పొందారు.

ఆమెకు గూగుల్.. గూగుల్ కు ఆమె..

గూగుల్ సంస్థ విజయంలో ఆమె పాత్రను కాదనలేం. ఆమె సక్సెస్ ఫుల్ కావటానికి గూగుల్ ను తక్కువ చేసి చెప్పలేం. ఇలా తన సంస్థకు తాను బలమై.. సంస్థ బలాన్ని పొందిన ఆమె.. కష్టపడి పని చేసే తత్వం.. కొత్తదనాన్ని ఆహ్వానించే వైఖరితో దూసుకెళ్లారు. వృత్తిపట్ల ఆమెకున్న కమిట్ మెంట్ గూగుల్ లో ఆమెను పైకి ఎదిగేలా చేసింది. అవసరం

అవన్నీ ఆమెవే..

గూగుల్ అందించే సేవల్లో ఎంతో మంది ఉపయోగించే గూగుల్ మ్యాప్స్.. గూగుల్ ఎర్త్.. గూగుల్ స్ట్రీట్వ్యూ.. డెస్క్ టాప్.. మొబైల్ ఫోన్లకు లోకల్ సెర్చ్ లాంటి ఎన్నో సేవల్ని అందించే ప్రాజెక్టులకు ఆమె నేతృత్వం వహించారు.ఆమె సారథ్యంలోనే ఇలాంటివెన్నో ఫీచర్లు వచ్చాయి. ఎంతో సక్సెస్ అయిన పలు ఫీచర్లలో ఆమె భాగస్వామ్యం ఉంది. దీంతో..ఆమె ప్రతిభ ఏమిటో ప్రపంచానికి తెలిసింది.

మరో అవకాశం

మరిస్సా తెలివితేటల్ని గుర్తించిన యాహు.. ఆమెకు తమ కంపెనీలో సీఈవో పదవిని ఆఫర్ చేశారు. దీంతో ఆమె గూగుల్ ని విడిచిపెట్టి.. 2012లో యాహులోకి వచ్చేశారు. అలా వచ్చిన ఆమె మళ్లీ తన సత్తాను చాటుకోవాల్సిన ఏర్పడింది. సవాళ్లకు వెనక్కి తగ్గే మనస్తత్వం కాని ఆమె.. తానేంటో చాటి చెప్పింది. ఆమె యాహులోకి అడుగుపెట్టే వేళకు గూగుల్ ధాటికి కాస్త చిన్నబోయిన పరిస్థితి. అలాంటిస్థితిలో ఉన్న యాహును తన తెలివితేటలతో.. టుంబ్లర్ ను యాహులో కలపటంలో ఆమె కీలక భూమిక పోషించారు. యాహులో చాలానే మార్పులు తెచ్చారు. ఇవన్నీ కూడా యాహు మళ్లీ నిలదొక్కుకునేందుకు సాయం చేశాయి.

ఎంత పని రాక్షసి అంటే..

మరిస్సా గురించి తెలిసిన వారంతా ఆమెను పని రాక్షసిగా అబివర్ణిస్తారు. వ్యక్తిగత జీవితానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. చేసే ఉద్యోగానికి అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఫైనాన్షియర్ బోగ్ ను పెళ్లి చేసుకున్న ఆమె 2012లో తొలిసారి గర్భవతి అయ్యారు. ఈ సందర్భంగా 16 వారాలు ఉద్యోగానికి మెటర్నటీ లీవు పెట్టిన ఆమె.. కేవలం నాలుగు వారాలకే ఉద్యోగానికి వెళ్లిపోయారు. తాజాగా ఆమె మరోసారి గర్భవతి అయ్యారు. ఈసారి కవలలు అంటున్న ఆమె.. పని విషయంలో ఆమె అస్సలు రాజీ పడరు. అందుకే.. ఆమె ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో 22 స్థానంలో నిలిచారు. ప్రపంచంలోని ప్రముఖ పత్రికల కవర్ పేజీల మీద దర్శనమిచ్చిన ఆమెకు ఇప్పుడు నలభైఏళ్లు.