Begin typing your search above and press return to search.

మెరీనా భావోద్వేగమే ‘ఆర్కే బీచ్’లోనూ.?

By:  Tupaki Desk   |   24 Jan 2017 6:27 AM GMT
మెరీనా భావోద్వేగమే ‘ఆర్కే బీచ్’లోనూ.?
X
ముందస్తు హెచ్చరికలు పెద్దగా ఏమీ లేకుండా విరుచుకుపడే విపత్తు మాదిరి.. విశాఖ ఆర్కే బీచ్ మౌనదీక్ష కార్యక్రమం మారింది. రిపబ్లిక్ డే తర్వాతి రోజున విశాఖపట్నంలో పెట్టుబడుల సమీకరణ కోసం భారీ ఎత్తున కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏపీ సర్కారు భారీ ఎత్తున కసరత్తు చేస్తోంది. గత ఏడాదికి మించిన రీతిలో ఏర్పాట్లు చేసి.. భారీ సక్సెస్ ను మూటగట్టుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తహతహలాడుతున్నారు.

ఇలాంటి వేళ.. ఊహించిన రీతిలో ఆర్కే బీచ్ మౌనదీక్ష కార్యక్రమాన్ని ప్రకటించటం.. దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు తెలపటం.. ఆవెంటనే ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ సైతం క్యాండిల్ ప్రదర్శన చేయాలని పిలుపునివ్వటంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జల్లికట్టుకు వ్యతిరేకంగా ఇచ్చిన ఆదేశాల్ని ఉపసంహరించుకోవాలని.. జల్లికట్టు మీద ఎలాంటి ఆంక్షలు ఉండకూదంటూ తమిళుల నిరసనలకు.. ఒక ఉద్యమరూపాన్ని ఇచ్చింది చెన్నైలోని మెరీనాబీచ్ లో ఏర్పాటు చేసిన నిరసన దీక్ష.

మెరీనాబీచ్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాపై గళం విప్పుతున్న నేపథ్యంలో.. విశాఖ ఆర్కే బీచ్.. మరో మెరీనా బీచ్ గా మారుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వాస్తవానికి జల్లికట్టుపై నిరసన చేపట్టేందుకు మెరీనా బీచ్ ను కార్యక్షేత్రంగా భావించినప్పుడు.. నిరసన కార్యక్రమాన్ని ఒక్కరోజు మాత్రమే అనుకున్నారు. అయితే.. ఈ నిరసన కార్యక్రమానికి వందలాదిగా వచ్చిన జనం.. కొద్ది గంటల వ్యవధిలోనే వేలాదిగా ప్రజలు వచ్చేయటం.. జల్లికట్టుపై కేంద్రం ఒక నిర్ణయం వెల్లడించే వరకూ వెనక్కితగ్గేది లేదని స్పష్టం చేశారు. వరుస పరిణామాలు కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేశాయి.

దీంతో.. జల్లికట్టు మీద వెనువెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధప్రాతిపదికన ఆర్డినెన్స్ జారీ చేసి.. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసేలా చర్యలు తీసుకున్నారు. మెరీనా బీచ్ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏపీ యువత.. ఏపీకి ప్రత్యేక హోదా మీద ఆర్కే బీచ్ ను తమ కార్యస్థలిగా ఎంపిక చేసుకున్నారు. మరి.. మెరీనా బీచ్ భావోద్వేగం ఆర్కే బీచ్ లో ఆవిష్కృతమవుతుందా? అదే జరిగితే.. ఏపీ అధికారపక్షంతో పాటు.. కేంద్రంలోని మోడీ సర్కారు పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ఉత్కంట రేపుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/