Begin typing your search above and press return to search.

అవును.. షరపోవా డ్రగ్స్ వాడింది

By:  Tupaki Desk   |   8 March 2016 12:32 PM IST
అవును.. షరపోవా డ్రగ్స్ వాడింది
X
ఒక్కసారి విన్న వెంటనే నమ్మకపోవచ్చు. పొరపాటు పడ్డారనుకోవచ్చు. కానీ.. ఆమ నిషేధిత డ్రగ్స్ వాడి.. డోపింగ్ టెస్ట్ లో దొరికిపోవటమే కాదు.. నాలుగేళ్లు టెన్నిస్ ఆడేందుకు వీల్లేకుండా నిషేధం ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది. తాను డోపింగ్ టెస్ట్ లో దొరికిపోయిన విషయాన్ని షరపోవానే స్వయంగా ఒప్పేసుకుంది. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డోప్ టెస్ట్ లో నిషేధిత మెల్డోనియం డ్రగ్ తీసుకున్నట్లు రుజువైంది.

ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలవటమే కాదు.. టెన్నిస్ ప్రపంచంలో తిరుగులేని మహరాణిలా రాణించిన షరపోవా డ్రగ్స్ వాడినట్లు తేలటం ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేస్తోంది. డ్రగ్స్ వినియోగంలో తాను చాలా పెద్ద తప్పు చేసినట్లుగా ఈ రష్యా టెన్నిస్ సుందరి ఒప్పేసుకుంది. నాలుగేళ్ల నుంచి టెన్నిస్ ఆడుతున్న ఆమె టెన్నిస్ ను తాను అమితంగా ప్రేమిస్తున్నట్లు చెబుతూనే.. డోపింగ్ లో దోషిగా తేలటంతో తనకు ఎదురయ్యే పరిస్థితుల గురించి తనకు తెలుసని చెప్పిన ఆమె.. తన కెరీర్ ను ముగించాలని తాను అనుకోవటం లేదని చెప్పుకొచ్చింది.

జనవరి 26న నిర్వహించిన డ్రగ్ టెస్ట్ లో షరపోవా ఫెయిల్ అయినట్లు రుజువు కావటంతో ఆమెపై నాలుగేళ్ల వరకూ బ్యాన్ పడే ప్రమాదం పొంచి ఉంది. అయితే.. ఈ కాలాన్ని కాస్త తగ్గించే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. టెన్నిస్ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన ఒక స్టార్ క్రీడాకారిణిపై ఇలాంటి చేదు నిజం వెలుగులోకి రావటం పెద్ద షాకింగ్ గా చెప్పక తప్పదు.