Begin typing your search above and press return to search.

అమరావతి రైతుల పాద‌యాత్ర‌పై దాష్టీకం !

By:  Tupaki Desk   |   18 Oct 2022 9:03 AM GMT
అమరావతి రైతుల పాద‌యాత్ర‌పై దాష్టీకం !
X
మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై వైసీపీ శ్రేణుల కవ్వింపులు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరం నగరంలో పాదయాత్రగా వెళ్తున్న రైతులను రెచ్చగొట్టేలా వైసీపీ కార్యకర్తలు వాటర్‌ బాటిళ్లు విసిరారు.

స్థానిక ఆజాద్‌ చౌక్‌ మీదుగా శాంతియుతంగా రైతులు, అఖిలపక్ష నేతలు వెళ్తుండగా నల్లబెలూన్లు ప్రదర్శిస్తూ వైసీపీ శ్రేణులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇటు అమరావతి రైతులు, అటు వైసీపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు.

అయితే.. ఈ కార్య‌క్ర‌మం మొత్తానికి రాజ‌మండ్రి ఎంపీ, వైసీపీ నాయ‌కుడు.. మార్గాని భ‌ర‌త్ నేతృత్వం వ‌హించ‌డం గ‌మ‌నార్హం. నేరుగా.. పాద‌యాత్ర‌లోకి వ‌చ్చేసిన మార్గాని.. రైతుల‌ను రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు.. వైస్సార్సీపీ శ్రేణులు బాటిళ్లు రైతుల‌పై విసిరారు. ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షక పాత్ర పోషించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వైసీపీ నేత‌ల‌ దుశ్చర్యను వివిధ పార్టీల నేతలు ఖండించారు.

టీడీపీ ఖండ‌న‌ అమరావతి రైతులపై వైసీపీ దాడి హేయమైన చర్య అని టీడీపీ విమర్శలు గుప్పించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు దాడి అద్దం పడుతుందన్నారు. నేరస్తుడి పాలనలో రాష్ట్రం నాశనమవుతోందన్నారు. ఎంపీ భరత్, పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మరిచి వ్యవహరించారని మండిపడ్డారు.

పట్టపగలు రైతులపై పెట్రోల్ సీసాలు, బీరు సీసాలు, కర్రలతో దాడి చేస్తున్నా పోలీసులకు పట్టదా అని ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతితో జరుగుతున్న పాదయాత్రకు రక్షణ లేని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఎంపీ మార్గాని భరత్‌తో పాటు దాడిలో పాల్గొన్న వైసీపీ నేతలందరి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.