Begin typing your search above and press return to search.

పవార్ మీద అనుచిత పోస్టును షేర్ చేసిన నటి జైల్లోనే

By:  Tupaki Desk   |   17 Jun 2022 7:30 AM GMT
పవార్ మీద అనుచిత పోస్టును షేర్ చేసిన నటి జైల్లోనే
X
దేశంలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. అధినేతలు చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన లేని పరిస్థితి. సోషల్ మీడియాలో డ్యామేజ్ కలిగేలా పోస్టులు పెట్టిన వారికి చుక్కలు చూపిస్తున్న పాలకులు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎక్కువ అవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి తెలిస్తే నోట మాట రాక మానదు. ఎంత అధికారం చేతిలో ఉంటే మాత్రం ఇలాంటి పరిస్థితా? అని షాక్ కు గురయ్యే పరిస్థితి.

మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ గా ఉండే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మీద సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టును 29 ఏళ్ల మరాఠీ నటి కేతకి చిటలే షేర్ చేశారు. దీంతో ఆమెపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎన్సీపీ క్యాడర్. తమ అభిమాన అధినాయకుడి మీద అనుచిత పోస్టును ఫార్వర్డ్ చేసిన ఆమెపై ఏకంగా 20 కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోవటం తెలిసిందే.

ఆ తీరులోనే ఆమెపై కేసులు నమోదు కావటం.. ఆ వెంటనే ఆమెను రిమాండ్ చేయటం జరిగిపోయాయి. ఇలాంటి కేసుల్లో నిర్ణీత వ్యవధి దాటిన తర్వాత విడుదల అవుతుంటారు. అందుకు భిన్నంగా ఈ నటి మాత్రం జైల్లోనే ఉంటున్న దుస్థితి. జైలుకు వెళ్లి నెల గడుస్తున్నా.. ఆమెకు బెయిల్ రావట్లేదు. దీనికి కారణం ఆమెపై 20కు పైగా కేసులు నమోదై ఉండటం. దీంతో.. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది కోర్టు. ఆమె చేసిన నేరాన్ని తీవ్రంగా పరిగణించటంతోనే బెయిల్ రాకపోవటానికి కారణంగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆమెకు థానే కోర్టు బెయిల్ ఇచ్చింది. అయినప్పటికీ ఆమె జైల్లోనే ఉండాల్సి వస్తోంది. దీనికి కారణం.. ఆమెపై పెట్టిన మిగిలిన కేసుల నేపథ్యంలో ఆమెను విడుదల చేయటం సాధ్యం కాదని జైళ్ల శాఖ చెబుతోంది. ఇక్కడో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాలి.

మరాఠీ నటి అరెస్టు కారణమైన పోస్టును ఒరిజినల్ పోస్టు పెట్టిన 23 ఏళ్ల ఫార్మసీ స్టూడెంట్ నిఖిల్ ను పోలీసులు అరెస్టు చేశారు.కాకుంటే అతనిపై మాత్రం ఆరు కేసులే నమోదయ్యాయి. అంటే.. పోస్టు పెట్టిన వ్యక్తి కంటే.. షేర్ చేసిన నటి మీదనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయన్న మాట.

ఇంతకీ ఇంత తీవ్రమైన నేరంగా భావిస్తున్న ఆ పోస్టులో ఉన్నదేమిటన్నది చూస్తే.. శరద్ పవార్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ ఇంటి పేరును.. ఆయన వయసును ప్రస్తావిస్తూ.. ‘బ్రాహ్మణుల్ని ద్వేషిస్తున్న నీ కోసం నరకం ఎదురు చూస్తోంది’ అంటూ పోస్టులో పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించటమే కాదు.. దీనికి భారీగా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి. అధికారంలో చేతిలో ఉన్న వారిని చిన్నమాట అన్నా.. భరించలేని పరిస్థితి ఇప్పుడు నెలకొందని చెప్పొచ్చు.