Begin typing your search above and press return to search.

తెలంగాణలో మారోసారి మావోల పోస్టర్ల కలకలం.. కేసీఆర్ కు వార్నింగ్

By:  Tupaki Desk   |   13 Oct 2020 11:00 PM IST
తెలంగాణలో మారోసారి మావోల పోస్టర్ల కలకలం.. కేసీఆర్ కు వార్నింగ్
X
చాలా రోజులుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు మావోల కలకలం చెలరేగింది. తాజాగా లేఖల ద్వారా మావోయిస్టులు కేసీఆర్ సర్కార్ కు పలు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో ఇన్నాళ్లు మావోల ఉనికి లేని చోట.. ఇప్పుడు ఏటూరు నాగారం, భూపాలపల్లి ఏరియా కమిటీ, ఉంగా పేరుతో వాల్ పోస్టర్లు పత్రికలు అంటించడం కలకలం రేపింది.

పోలీసులు కూంబింగ్‌ ఆపేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని మావోయిస్టుల పేరిట వెలిసిన పోస్టర్లు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం షాపల్లి గ్రామంలో తాజాగా మావోయిస్టుల పేరిట వాల్‌ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ పోలీసులు అడవుల్లో కూంబింగ్‌ ఆపకపోతే ఇటీవల టీఆర్‌ఎస్‌ నాయకుడు భీమేశ్వర్‌రావుకు పట్టిన గతే ఇతర టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు పడుతుందని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.

అలాగే ఫారెస్టు అధికారులు డీఆర్‌వో ప్రహ్లాద్‌, రవీందర్‌, సందీప్‌లు తమ పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఇక కేసీఆర్‌ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం పేరుతో చేసేదేమీ లేదని, ప్రజలు సమస్యలు అడిగితే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఈ పోస్టర్లతో స్థానిక ప్రాంతంలో కలకలం రేపుతోంది.

అంతేకాదు మాజీ మావోయిస్టు ముద్రబోయిన సంపత్ కు కూడా హెచ్చరికలు పంపారు. అతడు పోలీసులకు సహకరిస్తున్నాడని.. ప్రజల చేతిలో శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పెంచుతూ ప్రజలపై అక్రమ కేసులు పెడుతూ బలి చేస్తున్న కేసీఆర్ కు హెచ్చరికలు అంటూ మావోలు లేఖలో విమర్శించారు.

కాగా టీఆర్ఎస్ నేతను చంపిన ములుగు జిల్లాలోనే మావోయిస్టులు మరోసారి హెచ్చరిక లేఖలు వదలడం తెలంగాణలో మరోసారి ఉద్రిక్తతలకు దారితీస్తోంది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా సరిహద్దు గ్రామాలు, పట్టణాల నుంచి నగరాలకు వచ్చేస్తున్నారు.