Begin typing your search above and press return to search.

మాయదారి హూధూద్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మరణాలా?

By:  Tupaki Desk   |   23 Nov 2021 4:21 AM GMT
మాయదారి హూధూద్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మరణాలా?
X
ప్రచండ వేగంతో సాగే గాలులు.. లక్షలాది చెట్లు కూలిపోయి.. మొత్తంగా విశాఖ నగర రూపురేఖల్ని పూర్తిగా మార్చేసిన విశాఖపట్నాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. హుదూద్ తుపాను మిగిల్చిన బీభత్సానికి అప్పట్లో విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సైతం నిర్ఘాంతపోయారు. అంతలా విధ్వంసాన్ని క్రియేట్ చేసిన విపత్తు వేళలో.. మరణించిన వారి సంఖ్య వేళ్ల మీద లెక్కించొచ్చు.

భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినప్పటికీ.. ప్రాణ నష్టం మాత్రం చాలా చాలా తక్కువగా మాత్రమే చోటు చేసుకుంది. 2014 అక్టోబరులో చోటు చేసుకున్న ఈ తుపానుకారణంగా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలు దారుణంగా ఎఫెక్టు అయితే.. విశాఖపట్నానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. గంటకు 200కి.మీ.లకు పైనే వీసిన రాక్షస గాలులు ప్రజల్ని వణికిపోయేలా చేశాయి. గదిలో తలుపులు..కిటికీలు మూసుకున్నప్పటికీ గుండె దడ దడ లాడేలా వీచిన గాలుల వేళ అనుకోని రీతిలో బయటకు వచ్చిన వారు పడిన అవస్థలు అన్ని ఇన్ని కావు. ఇంత జరిగినప్పటికీ ఏపీలో హుధూద్ కారణంగా చోటు చేసుకున్న మరణాలు తక్కువే. అందుకు భిన్నంగా ఒడిశాలో మాత్రం పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి.

కట్ చేస్తే.. గడిచిన వారంలో ఏపీలో కురిసిన భారీ వర్షాలు.. అనంతరం పోటెత్తిన వరద కారణంగా వేలాది మంది ప్రభావితమయ్యారు. రోడ్లు.. వంతెనలు.. ఇలా ఒకటేమిటి? అన్ని రకాల మౌలిక వసతుల మీదా తీవ్ర ప్రభావాన్ని చూపింది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మూడు జిల్లాలు తాజా వర్షాలకు ప్రభావితమయ్యాయి. చిత్తూరు..కడప.. అనంతపురంతో పాటు.. నెల్లూరు జిల్లా కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ భారీ వర్షాలు.. వరదల కారణంగా చోటు చేసుకున్న మరణాలు మాత్రం కలిచివేసేలా మారాయి.

సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం వర్షాలు.. వరదల కారణంగా అధికారికంగా మరణించిన వారి సంఖ్య 34గా వెల్లడించారు. ఇప్పటికి గల్లంతైన వారి సంఖ్య మరింత భారీగా ఉంది. హుధూద్ లాంటి విపత్తు వేళలో మరణాలు చాలా తక్కువగా ఉంటే.. అందుకు భిన్నంగా తాజా వరదలకు పెద్ద ఎత్తున ప్రాణాలు పోవటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. అధికారికంగా ప్రకటించిన మరణాలతో పాటు మరో 10 మంది ఆచూకీ కూడా లభించటం లేదని చెబుతున్నారు.

మరణించిన వారిలో బాధితుల్ని రక్షించేందుకు వెళ్లిన రెస్క్యు సిబ్బందిలో ముగ్గురు ఉన్నట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు. చనిపోయిన కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని.. బాధితులకు తక్షణ సాయంగా ఖర్చు చేయటానికి వీలుగా కడప.. చిత్తూరు.. నెల్లూరు జిల్లా కలెక్టర్లకు రూ.10 కోట్లు.. అనంతపురం జిల్లా కలెక్టర్ కు రూ.5 కోట్ల చొప్పున ఇచ్చినట్లు చెబుతున్నారు. మిగిలిన అంశాలుఎలా ఉన్నా.. ఇంత భారీగా మరణాలు చోటు చేసుకోవటం మాత్రం ఏపీ ప్రభుత్వానికి మచ్చలా మిగిలిపోవటం ఖాయమని చెప్పక తప్పదు.