Begin typing your search above and press return to search.

ఈ ఎస్సై రాక్షసుడికి మరో రూపం!

By:  Tupaki Desk   |   31 Aug 2018 12:55 PM GMT
ఈ ఎస్సై రాక్షసుడికి మరో రూపం!
X
సమాజంలో పోలీసు వృత్తి పట్ల అందరికి గౌరవం ఉంటుంది. అన్యాయం జరిగితే పోలీసుల వద్దకు వెళ్తే న్యాయం జరుగుతుంది - తప్పు చేసిన వారికి పోలీసులు అంటేనే భయం కలుగుతుంది. అంతటి మంచి పోలీసు వృత్తిలో ఉన్న ఒక ప్రభుద్దుడు చేసిన పనిని సాటి పోలీసులు కూడా తప్పుబడుతున్నారు. కట్టుకున్న భార్యను కన్నుమిన్ను కానకుండా రక్తం వచ్చేలా కొట్టి - చేతిలో చిన్న బాబు ఉన్నాడనే విషయం మర్చి విచక్షణ రాహిత్యంగా గాయపర్చిన ఎస్సై సముద్రాల జితేందర్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌ జిల్లా మొగిళ్లపాడుకు చెందిన జితేంద్ర 2015లో ఎస్సైగా వెంకటాపురంలో తన సర్వీస్‌ ను మొదలు పెట్టాడు. ఆ సమయంలోనే పర్వీన్‌ తో పరిచయం అయ్యింది. ఆమెను ప్రేమించినట్లుగా నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల్లోనే అతడు పర్వీన్‌ తో గొడవ పడటం ప్రారంభించాడు. పెళ్లి అయిన కొన్ని నెలల్లోనే ప్రెగ్నెన్సీ కావడంతో బలవంతంగా ఆమెకు అబార్షన్‌ చేయించాడని, అక్రమ సంబంధం పెట్టుకున్న జితేంద్ర పర్వీన్‌ను పదే పదే పర్వీన్‌ ను కొడుతూ ఉండేవాడు అంటూ బంధువులు చెబుతున్నారు. జితేంద్రకు కొత్తగూడెం బదిలీ అయిన తర్వాత మరోసారి పర్వీన్‌ ప్రెగ్నెంట్‌ అయ్యింది. మరోసారి అబార్షన్‌ కు బలవంతం చేయడంతో పర్వీన్‌ అందుకు ఒప్పుకోలేదట.

అబార్షన్‌ కు ఒప్పుకోక పోవడంతో పర్వీన్‌ ను హింసించాడని, కొన్నాళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది. పర్వీన్‌ 10 నెలల క్రితం బాబుకు జన్మనిచ్చింది. బాబు పుట్టినప్పటి నుండి కూడా చూసేందుకు రాలేదట. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా కూడా రిసీవ్‌ చేయకపోవడంతో తల్లితో కలిసి పర్వీన్‌ ఎస్సై ఉంటున్న ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో తీవ్ర ఆగ్రహంతో రగిలి పోయిన ఎస్సై జితేందర్‌ భార్యపై దారుణంగా విరుచుకు పడ్డాడు. చేతిలో పసి పిల్లాడు అని కూడా చూడకుండా చేతికి అందిన వస్తువుతో ఆమెను కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. పర్వీన్‌ రక్త స్రావం అయ్యి పిల్లాడు కూడా రక్తమయం అయ్యాడు. కూతురును కొడుతున్న జితేందర్‌ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పర్వీన్‌ తల్లిని కూడా ఇష్టం వచ్చినట్లుగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పింది.

ఈ మొత్తం దారుణంను స్థానిక రిపోర్టర్‌ తన కెమెరాలో బంధించాడు. ఆ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ ఎస్సైపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జితేందర్‌పై కేసు నమోదు చేసినట్లుగా డీఎస్పీ పేర్కొన్నారు. రాక్షసుడికి మరో రూపం జితేందర్‌ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. చేతిలో చిన్న బాబు ఉన్నాడు అనే జ్ఞానం లేకుండా అంతగా కొట్టిన అతడిని ఏం చేసినా తప్పులేదు అంటూ నెటిజన్‌లు కామెంట్‌ చేస్తున్నారు.