Begin typing your search above and press return to search.

పారీకర్ చెప్పిన జోక్ విన్నారా?

By:  Tupaki Desk   |   19 Sept 2016 1:15 PM IST
పారీకర్ చెప్పిన జోక్ విన్నారా?
X
సరదాగా మాట్లాడే కేంద్రమంత్రుల్లో మనోహర్ పారీకర్ ఒకరు. నిరాడంబరంగా ఉంటూ.. మీడియా ప్రతినిధులతో సరదాగా మాట్లాడే ఆయన.. తన రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో పంచ్ లు వేయటం పారీకర్ కు ఒక అలవాటు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన.. తాజాగా చెప్పిన జోక్ ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తరచూ ఏదో ఒక వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించే అమ్ ఆద్మీ పార్టీ అధినేత.. డిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై పారీకర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే కేజ్రీవాల్.. గోవాకు వస్తే తన గురించి తరచూ విమర్శలు గుప్పిస్తారన్నారు. కేజ్రీవాల్ నాలుక ఈ మధ్య పెరిగిపోయిందని.. అందుకే మొన్నామధ్య పెరిగిన నాలుకను కట్ చేయాల్సి వచ్చిందన్నారు.

ఈ మధ్య అనారోగ్యంగా ఉన్న కేజ్రీవాల్ పై సానుభూతి వ్యక్తం చేసిన పారీకర్.. ఇటీవల తన దృష్టికి ఒక జోక్ వచ్చిందన్నారు. వాట్సప్ లో సర్క్యులేట్ అవుతున్న ఈ జోక్ గురించి చెబుతూ.. ‘‘ఈ మధ్యనే తీహార్ జైలు సూపరింటెండెంట్ ఢిల్లీ గవర్నర్ కు ఒక లేఖ రాశారట. మెజార్టీ ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలు తన వద్దనే ఉన్నందున తనకు సీఎం పదవి ఇవ్వాలని కోరుకున్నారట’’ అంటూ తనదైన శైలిలో జోకేశారు. వివిద ఆరోపణలపై ఈ మధ్యకాలంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు చొప్పున జైలుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పారీకర్ వేసిన జోక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.