Begin typing your search above and press return to search.

సర్జికల్ స్ట్రైక్ ఆరెస్సెస్ ఖాతాలో వేసిన పారికర్?

By:  Tupaki Desk   |   18 Oct 2016 4:33 AM GMT
సర్జికల్ స్ట్రైక్ ఆరెస్సెస్ ఖాతాలో వేసిన పారికర్?
X
మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సర్జికల్ స్ట్రైక్ కచ్చితంగా మంచి పేరునే తీసుకొచ్చిందని చెప్పాలి. ఇంతకాలం శాంతి శాంతి - చర్చలు చర్చలు అంటూ వినిపించిన భారత్ నుండి ఉన్నట్లుండి సర్జికల్ స్ట్రైక్ పేరుతో పాక్ ను చెంపదెబ్బ కొట్టడంపై ప్రతీ భారతీయుడూ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆ సర్జికల్ స్ట్రైక్ అనంతరం అది రాజకీయ రంగు పులుముకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నా... సర్జికల్ స్ట్రైక్ చేసిన ఘనత మాత్రం మోడీ ప్రభుత్వానికి మంచి పేరే తెచ్చింది. అయితే ఈ క్రెడిట్ ను ఆరెస్సెస్ ఖాతాకి మళ్లిస్తున్నారు రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్. దేశ రక్షణకు, ఉగ్రవాదులపై దాడులకు తమ ప్రణాళికలు, ఎదురవుతున్న పరిస్తితులు కారణం కాదని అది ఒక సంస్థకు ఇచ్చిన బోధనల వల్లే వచ్చిందని చెప్పే ప్రయత్నం చేయడం పలువురుకి కాస్త ఇబ్బందికలిగించే విషయమనే చెప్పాలి.

తాజా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన సర్జికల్ దాడులపై స్పందించిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. ఆ దాడులు చేయాలనే ఆలోచన బహుశా తమకు ఆరెస్సెస్ బోధనల వల్లే వచ్చి ఉండొచ్చని అంటున్నారు. మహాత్మాగాంధీ పుట్టిన గుజరాత్ నుంచి వచ్చిన ప్రధాని మోడీ, సైనిక బలగాల చరిత్రలేని గోవా నుంచి వచ్చిన తాను కలసి ఈ దాడులకు ఆదేశాలివ్వడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అహ్మదాబాద్‌ లోని నిర్మా వర్సిటీ నిర్వహించిన "నో మై ఆర్మీ" కార్యక్రమంలో పారికర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ పుట్టిన రాష్ట్రం నుంచి వస్తే సైనిక చర్యల విషయంలో నిర్ణయాలు తీసుకోలేరా? సైనిక బలగాల చరిత్ర లేని ప్రాంతం నుంచి వస్తే రక్షణమంత్రిగా పనిచేయడానికి వేరే సంస్థల బోధనలు సహాయసహకారాలు అందించాలా? దేశస్థాయి నాయకులు నిర్ణయాలు తీసుకునే విషయంలో మరీ అంత బలహీనంగా ఉంటారా? వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి!

ఇదే సమయంలో తమపై వస్తోన్న విమర్శలపై కూడా పారికర్ స్పందించారు... కొంతమంది ఈ దాడులకు సాక్ష్యాలు అడుగుతున్నారు.. ఆర్మీ చెబితే నమ్మాలి.. సాక్ష్యాలు ఇచ్చాక కూడా నమ్మని వారు కొందరుంటారు.. ప్రపంచంలోనే అత్యుత్తమ సైన్యం మనకుంది.. అని అన్నారు. సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఈ ఐదారేళ్లలో చాలామార్లు ఉల్లంఘించిందని, అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే ప్రస్తుతం మనం వారికి తగిన విధంగా సమాధానమిస్తున్నామని కాంగ్రెస్ పై సెటైర్ వేశారు. కాగా, కశ్మీర్‌ లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రాజౌరీ సెక్టార్‌ లో పాక్ దళాలు జరిపిన తాజా కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌ లోని సంభల్ జిల్లాకు చెందిన సుదీష్ కుమార్ (24) అనే సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. దానికి బదులుగా భారత దళాలు కూడా కాల్పులు జరిపాయని మనోహర్ పారికర్ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/