Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాలకు కొత్త దేవుళ్లు

By:  Tupaki Desk   |   18 Jun 2016 11:49 AM GMT
తెలుగు రాష్ట్రాలకు కొత్త దేవుళ్లు
X
విభజన తరువాత కేంద్రం నుంచి రకరకాల డిమాండ్డు సాధించుకోవడంలో తలమునకలవుతున్న తెలుగు రాష్ర్టాలకు కొత్త దేవుళ్లొచ్చారు. కేంద్రంలోని మంత్రులు - ప్రధాని మోడీ వద్దకు నెలనెలా వెళ్లి తమ డిమాండ్లు వినిపిస్తున్నా సాధ్యం కాని పనులు ఇప్పుడు కొత్త దేవుళ్ల దెబ్బకు ఒక్కటొక్కటిగా తీరుతున్నాయి. కేంద్రం నుంచి తెలుగు రాష్ర్టాల్లో పర్యటిస్తున్న మంత్రులు వరాలు కురిపిస్తుండడంతో ఇక్కడి ముఖ్యమంత్రులే ఆశ్చర్యపోతున్నారట. ఇప్పటికే ఏపీలో కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వరాలు కురిపించగా.. ఇప్పుడు తెలంగాణకు మరో మంత్రి మనోహర్ పారికర్ వరాలిస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు విందు రాజకీయాలతో మంత్రులను మొహమాట పెట్టేస్తుండడంతో వారు అన్నిటికీ ఓకే అంటూ వరాలిస్తున్నారు.

కేంద్ర రైల్వే శాఖ మంత్రికి పసందైన విందు ఇచ్చి... సమస్యలు ఏకరువు పెట్టిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఫలితాలు రాబట్టారు. విజయవాడ- సికింద్రాబాదుల మధ్య సచివాలయ ఉద్యోగుల రాకపోకల కోసం ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ను సాధించిన చంద్రబాబు... విశాఖ కేంద్రంగా ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ను కూడా దాదాపుగా సాధించారు. సౌత్ ఈస్ట్ కోస్ట్ జోన్ పేరిట కొత్త జోన్ ను ఈ నెల 21న సురేశ్ ప్రభు ప్రకటించనున్నట్లు సమాచారం. తాజాగా కేంద్రాన్ని దారికి తెచ్చుకునేందుకు తెలంగాణ సర్కారు విందు రాజకీయాల బాట పట్టిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పర్యటనకు నేటి ఉదయం హైదరాబాదులో అడుగుపెట్టిన కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ కు తెలంగాణ ప్రభుత్వం నేటి మధ్యాహ్నం విందు ఏర్పాటు చేసింది. దుండిగల్ లో వైమానిక దళ కార్యక్రమానికి హాజరైన ఆయన కొద్దిసేపటి క్రితం ఆదిభట్ల సెజ్ లో టాటా బోయింగ్ ఏరో స్పేస్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలుస్తుందని ప్రకటించారు. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

సురేశ్ ప్రభు విందు తరువాత వరాలిస్తే.. పారికర్ మరో అడుగు ముందుకేసి విందుకు వెళ్లడానికి ముందే వరాలిస్తున్నారు. విందుకు ముందుగానే కేంద్ర మంత్రి నుంచి సానుకూల ప్రకటన సాధించిన తెలంగాణ సర్కారు విందు తర్వాత మరెంత సత్ఫలితాలు సాధిస్తుందో చూడాలి.