Begin typing your search above and press return to search.

ఆప్ ఎంపీ ఎందుకంత ప‌నిచేశాడు..

By:  Tupaki Desk   |   22 July 2016 9:30 AM GMT
ఆప్ ఎంపీ ఎందుకంత ప‌నిచేశాడు..
X
ఆప్ ఎంపీ భ‌గ‌వంత్ మాన్ పార్ల‌మెంటులో తీసిన వీడియో పెను దుమారాన్ని సృష్టిస్తోంది. ఇంత‌కాలం పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌ని ఆయ‌న ఒక్క వీడియోతో దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిపోయాడు. ఆయ‌న చేసిన ప‌నిని ఎవ‌రూ మెచ్చుకోక‌పోయినా కూడా రావాల్సిన పాపులారిటీ మాత్రం వ‌చ్చేసింది. ఉద్దేశ‌పూర్వ‌కంగానే చేసిన‌ట్లుగా ఉన్న ఈ ప‌ని వెనుక ఆలోచ‌న ఆయ‌న సొంత‌మా.. లేదంటే పార్టీదా అన్న‌దీ అనుమాన‌స్ప‌దంగా ఉంది. రెండింటికీ అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అస‌లు భ‌గ‌వంత్ సింగ్ మాన్ ఎవ‌రు అని ప్ర‌శ్నిస్తే.. అక్క‌డి నుంచి ఈ వ్య‌వ‌హారం వెనుక ఉద్దేశాలు స్ప‌ష్ట‌మ‌వుతాయి.

భ‌గ‌వంత్ మాన్‌... ఆప్ ఎంపీ అన్నంత వ‌ర‌కే దేశంలో చాలామందికి తెలుసు. కానీ.. ఇటీవ‌ల ప‌రిణామ‌ల‌న్నీ బేరీజు వేస్తే ఇది ప‌క్కా స్కెచ్ అని తెలుస్తోంది. భ‌గ‌వంత్ మాన్ పంజాబ్ లోని సంగ్ రూర్ నియోజ‌క‌వ‌ర్గ ఆప్ ఎంపీ. అంత‌కంటే ముందు పాపుల‌ర్ స్టాండ‌ప్ క‌మెడియ‌న్. సినిమాల్లోనూ న‌టించాడు. వంద‌లాది కామెడీ ఆల్బ‌మ్ లు ఆయ‌న‌వి ఉన్నాయి. పంజాబ్ లో పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న ఆప్ కు పంజాబ్ లో ఉన్న ఏకైక ఛ‌రిష్మాటిక్ ప‌ర్స‌న్. ఆప్ కు అక్క‌డ ఆద‌ర‌ణ ఉన్నా సిక్కు మ‌తానికి చెందిన గొప్ప నేత‌లెవ‌రూ పార్టీలో లేరు. ఆ పార్టీలో ఉన్న ఏకైక ప్ర‌ముఖుడు మాన్ మాత్ర‌మే. దీంతో ఆయ‌నే ఆప్ సీఎం కేండిడేట్ అన్న‌ట్లుగా ఉండేది.

కానీ.. సిద్దూ బీజేపీకి రాజీనామా చేయ‌డంతో ఆయ‌న ఆప్ లో చేరుతార‌ని అనుకుంటున్నారు. సిద్దూ ఆప్ లో చేరితే ఆయ‌న్నే సీఎం కేండిడేట్ గా ప్ర‌క‌టించి ఆప్ పంజాబ్ ఎన్నిక‌ల‌ను న‌డిపించే ఛాన్సు ఉంటుంది. అప్పుడు ఇంత‌కాలం మాన్ పెట్టుకున్న ఆశ‌లు గ‌ల్లంత‌వుతాయి. దీంతో ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి పాపుల‌ర్ కావాల‌న్న ఉద్దేశంతో మాన్ ఈ ప‌నిచేసిన‌ట్లుగా భావిస్తున్నారు.

అదే స‌మ‌యంలో సిద్దూ ఇంకా ఆప్ కు క్లియ‌రెన్సు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న వేరే ఆలోచ‌న‌లో ఏమైనా ఉన్నారా.. సొంతంగా పార్టీ పెడ‌తారా.. కాంగ్రెస్ లో చేరుతారా అన్న అనుమానాలూ ఆప్ లో ఉన్నాయి. ఒక‌వేళ సిద్దూ అలా చేస్తే ఆప్ కు న‌స్టం. సో.. సిద్దూకు స‌మానంగా మాన్ ఇమేజి్ పెంచేందుకు ఆప్ అధినాయ‌క‌త్వ‌మే ఈ ప్లాన్ వేసింద‌న్న అనుమానాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొత్తానికి ఒక్క ప్లానుతో అనుకున్నంత పాపులారిటీ వ‌చ్చేసినా సిద్దూ పాపులారిటీకి మాన్ స‌రితూగ‌గ‌ల‌రా అన్న‌ది సందేహ‌మే.​