Begin typing your search above and press return to search.

మణిపూర్లో ఒకే రోజు 40 మంది తిరుగుబాటుదారుల కాల్చివేత

By:  Tupaki Desk   |   28 May 2023 10:27 PM GMT
మణిపూర్లో ఒకే రోజు 40 మంది తిరుగుబాటుదారుల కాల్చివేత
X
మణిపూర్ లో ఈ రోజు (ఆదివారం) అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో నలభై మంది మరణించిన వైనం పెను సంచలనంగా మారింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటుదారులపై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 40 మంది మరణించినట్లుగా చెబుతున్నారు. అయితే.. భద్రతా దళాల వాదన మరోలా ఉంది. కాల్పులు జరిపింది.. తీవ్రవాదుల మీద అంటున్న వైఖరి సంచలనంగా మారింది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురయ్యేలా చేస్తోంది.

భద్రతా దళాల ప్రకటన ప్రకారం.. నలభై మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లుగా పేర్కొన్నారు. సాధారణ పౌరులపై ఎమ్ 16, ఏకే 47, స్నైపర్ గన్లతో ఉగ్రవాదులు సాధారణ ప్రజలపై దాడులు జరుపుతున్నారని.. గ్రామాల్లోకి వెళ్లి ఇళ్లకు నిప్పు పెడుతున్నారని.. ఇలాంటి వారిపై ఇండియన్ ఆర్మీ.. భద్రతాదళాల సాయంతో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.

మీడియాతో మాట్లాడిన సందర్భంగా ముఖ్యమంత్రి బీరేన్ చెప్పిన లెక్కల ప్రకారం 40 మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా పేర్కొన్నారు. కాల్పుల్లో మరణించిన వారిని కుకీ మిలిటెంట్లుగా పరిగణించలేమని.. వారంతా ఉగ్రవాదులుగా సీఎం పేర్కొన్నారు. అర్థరాత్రి రెండు గంటల వేళలో ఇంఫాల్ లోయలోని.. సేక్ మయి.. సుంగు.. ఫయేంగ్.. సెరయు తదితర ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు కాల్పులకు తెగబడ్డారని.. దీంతో భద్రతా దళాలు అక్కడకు చేరుకొని ఎదురు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు.

ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో కాల్పులు జరుగుతున్నట్లు చెబుతున్నారు. పలు వీధుల్లో గుర్తు తెలియని డెడ్ బాడీలు పడి ఉన్నట్లుగా చెబుతున్నారు. కొద్ది రోజులుగా మణిపూర్ లో హింసాత్మక పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిదే. ఎస్టీ హోదా కోసం మొయిటీ వర్గానికి చెందిన వారు బిమాండ్ చేయటంతో మణిపూర్ వ్యాలీకి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీనిపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేసిన ఆందోళన చేపట్టారు. ఇది కాస్తా ఘర్షణకు దారి తీసింది. మణిపూర్ జనాభాలో మెజార్టీలుగా ఉన్న మొయిటీల వర్గానికి చెందిన వారిదే. మణిపూర్ వ్యాలీలో వారి ప్రాబల్యం ఎక్కువ. బంగ్లాదేశ్.. మయన్మార్ నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వలసదారుల కారణంగా తాము సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా చోటు చేసుకున్న కాల్చివేతల ఉదంతం షాకింగ్ గా మారింది.