Begin typing your search above and press return to search.

చిల్లర తగువుల్లో వేలుపెడుతున్న మంత్రిగారు

By:  Tupaki Desk   |   17 Feb 2016 7:36 AM GMT
చిల్లర తగువుల్లో వేలుపెడుతున్న మంత్రిగారు
X
ఏపీ దేవాదాయ మంత్రి, బీజేపీ నేత తన స్థాయిని మరిచి చిల్లర వివాదాల్లో తలదూర్చుతున్నారట. ఇరుగుపొరుగు గొడవలు... వీధి కుళాయి గొడవల్లోనూ తలదూర్చి తనకు కావాల్సినవారిని సంతోష పెట్టడం కోసం వారి వ్యతిరేకులను అరెస్టు చేయాలంటూ పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారట. మంత్రి మాణిక్యాల రావు సొంతూరు తాడేపల్లిగూడెంలో ఇప్పుడిది హాట్ టాపిగ్గా మారింది.

తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన పుల్లా శ్రీనివాస్ భార్య వెంకట సత్యవతి - ముగ్గురు కుమారులతో కలిసి వ్యవ సాయం చేసుకుంటున్నారు. పది రోజుల కిందట ఆ ఊరికే చెందిన తమ్మాబత్తుల ధనరాజు, తమ్మాబత్తుల నాగేశ్వరరావు ఎవరూ లేని సమయం చూసి శ్రీనివాస్ ఇంటి ముందున్న ఓ మొక్కను పీకివేశారు. సాయంత్రం పొలం నుంచి తిరిగి వచ్చిన వెంకట సత్యవతి ఈ విషయం తెలుసుకుని ధనరాజు - నాగేశ్వరరావులను ప్రశ్నించింది. వారు ఆమెపై గొడవకు వచ్చి మేమే ఆ మొక్కను తీసేశాం.. నీ దిక్కున్న చోట చెప్పుకో అని దుర్భాషలాడారు. ఆమెపై దౌర్జన్యానికి దిగారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ భార్య ద్వారా విషయం తెలుసుకుని వాళ్లను అడిగేందుకు వెళ్లగా, అతనిపైనా దాడి చేశారు. శ్రీనివాస్‌ కు గాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకుని గూడెం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.... ఈ విషయంలో మంత్రి మాణిక్యాలరావు ఎంటరై పోలీసులపై ఒత్తిళ్లు మొదలు పెట్టారట. తమ్మాబత్తుల ధనరాజు - నాగేశ్వరరావుపై కేసుల్లేకుండా చూడాలని ఆదేశించారు. అంతేకాదు... ధనరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పుల్లా శ్రీనివాస్‌ నే అరెస్ట్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని సమాచారం.

అయితే... ఆ కేసులో ధనరాజు - నాగేశ్వరరావు దౌర్జన్యం చేసినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, పుల్లా శ్రీనివాస్ దాడి చేసినట్టు ఆధారాల్లేవని పోలీసులు మొత్తుకుంటున్నా మంత్రి మాత్రం వారిద్దరిపై కేసులు తొలగించాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకో విషయం ఏంటంటే ఈ కేసులో నిందితులకు కాల్ మనీ కేసుల్లోనూ సంబంధాలున్నాయట. అలాంటివారికి మంత్రి వత్తాసు పలకడం విమర్శలకు దారితీస్తోంది.

కాగా మంత్రి మాణిక్యాలరావు చెప్పినట్టు వినకండి. మీరేం చేయాలో అదే చేయండి. మీకేం కాకుండా మేం చేసుకుంటాం అంటూ టీడీపీ నేతలు పోలీసుల తరఫున మాట్లాడుతున్నట్టు సమాచారం. పోలీసులపై ప్రేమ కంటే మాణిక్యాలరావుతో ఉన్న వర్గపోరు నేపథ్యంలో టీడీపీ నేతలు ఖాకీలకు మద్దతు ప్రకటిస్తున్నారనేది బహిరంగ ర హస్యం. ఈ విషయమై టీడీపీ నేతలు తమతో మాట్లాడుతున్నారని తెలిస్తే మాణిక్యాలరావుకు కోపం తారస్థాయికి చేరుతుందని పోలీసు వర్గాలు భయపడిపోతున్నాయి. మొత్తంగా అటు మాణిక్యాలరావు ఒత్తిళ్లు.. ఇటు టీడీపీ నేతల ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న పోలీసులు చివరకు ఆ కేసు విచారణలో ఎలా వ్యవహరిస్తారో చూడాల్సిందే.