Begin typing your search above and press return to search.

20 ఏళ్ల పాలనను త్రుటిలో మిస్సయిన మాణిక్ సర్కార్

By:  Tupaki Desk   |   3 March 2018 8:21 AM GMT
20 ఏళ్ల పాలనను త్రుటిలో మిస్సయిన మాణిక్ సర్కార్
X
సీపీఎంకు నమ్మకమైన రాష్ట్రం త్రిపురలో మాణిక్ సర్కార్ సుదీర్ఘ కాలంగా ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే... ఆయన 20 ఏళ్ల పాలన పూర్తి చేయడానికి కొంచెం రోజుల ముందు పదవి నుంచి దిగిపోనున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ గెలవడంతో త్వరలోనే ఆ పార్టీ అక్కడ అధికారం చేపట్టనుంది. దీంతో మాణిక్ పదవి నుంచి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మాణిక్ 1998 మార్చి 11న తొలిసారి త్రిపుర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయనే సీఎం. తాజాగా ఈరోజు అంటే 2018 మార్చి 3న వెలువడిన ఫలితాలలో సీపీఎం 19 సీట్లకే పరిమితం కావడంతో అధికారం కోల్పోయింది. దీంతో సీఎం సీటు కోల్పోతున్న మాణిక్ 20 ఏళ్ల సీఎం అన్న రికార్డును 7 రోజుల తేడాతో కోల్పోనున్నారు.

కాగా త్రిపురలో 1971లో 47 ఏళ్ల కిందట రాష్ర్టంగా ఏర్పడిన త్రిపురలో 35 సంవత్సరాలు కమ్యూనిస్టు పాలనే ఉంది. అయితే.. ఈ 35 ఏళ్లలో ముగ్గురు మాత్రమే సీఎంలుగా పనిచేశారు. 1978 జనవరి 5న తొలిసారి అధికారంలోకొచ్చిన సీపీఎం నృపేన్ చక్రవర్తిని సీఎం చేసింది. 1983లోనూ మళ్లీ ఆ పార్టీయే అధికారం అందుకుంది. మళ్లీ నృపేన్‌నే సీఎం చేశారు. ఆ తరువాత 1988లో సీపీఎం అధికారం కోల్పోగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 1993లో నెల రోజుల రాష్ట్రపతి పాలన తరువాత మళ్లీ సీపీఎం అధికారంలోకి రాగా దశరథ్ దేవ్ సీఎం అయ్యారు. అయిదేళ్ల తరువాత 1998లో మాణిక్ సర్కార్ సీఎం కాగా వరుసగా నాలుగు పర్యాయాలు ఆయనే సీఎంగా ఉన్నారు. అయిదోసారి పార్టీ ఓటమి కారణంగా పదవి పోగొట్టుకున్నారు.