Begin typing your search above and press return to search.

మంగళూరు గోడల మీద ఆ రాతలు.. ఏం జరుగుతోంది యడ్డీ?

By:  Tupaki Desk   |   27 Nov 2020 4:20 PM GMT
మంగళూరు గోడల మీద ఆ రాతలు.. ఏం జరుగుతోంది యడ్డీ?
X
షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని మంగళూరులోని రోడ్డు మీద గోడ మీద రాసిన రాతలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ముంబయి మారణహోమం జరిగి నిన్నటికి పన్నెండేళ్లు పూర్తి అయ్యింది. ఈ మారణకాండను తల్చుకుంటూ దేశ వ్యాప్తంగా ప్రజలు నివాళులు అర్పించారు. దేశమంతా ఒకలా ఉంటే కర్ణాటకలోని మంగళూరులో మరోలాంటి పరిస్థితి నెలకొంది.

ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే రాతలు కలకలాన్ని రేపాయి. ‘సంఘీలు.. మన్వేదిలను కట్టడి చేయటానికి లష్కరే తోయిబా ఉగ్రవాదులను.. మిలిటెంట్లను రంగంలోకి దించే పరిస్థితులు తీసుకురాకండి’’ అంటూ నలుపు రంగు పెయింట్ తో గోడ మీద వివాదాస్పద రాతలు రాశారు. ఈ రాతలు ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఎవరు ఈ రాతలు రాశారా? అన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ రాతలు కర్ణాటకలో ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకొచ్చాయి. గోడ మీద రాతలకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నంతనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వెంటనే ఆ రాతల్ని తుడిపించేశారు. దగ్గర్లోని సీసీ కెమేరా ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం గోవధ నిషేధించే చట్టంతో పాటు.. వివాహం కోసం మాత్రమే జరిగే మత మార్పిులను నిషేధించే చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇలాంటివేళ.. ఈ తరహా రాతలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి.. వీటి బాధ్యుల్ని కర్ణాటక పోలీసులు ఎప్పటికి పట్టుకుంటారో చూడాలి. ముంబయి మారణహోమంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు కీలకభూమిక పోషించారు. నాటి ఘటనలో 166 మంది చనిపోగా.. 300 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.