Begin typing your search above and press return to search.

మందీమార్బలం అప్పట్నుంచే.. అఖిలప్రియ కేసు!

By:  Tupaki Desk   |   17 Jan 2021 12:00 PM IST
మందీమార్బలం అప్పట్నుంచే.. అఖిలప్రియ కేసు!
X
సంచలనం రేకెత్తించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో పోలీసులు మరో 15 మంది నిందితుల్ని శనివారం అరెస్టు చేశారు. దీంతో.. ఈ కేసులో అఖిలప్రియ సహా ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 19 మందికి చేరింది. తాజాగా అరెస్టు అయిన వారంతా.. కిడ్నాప్‌ జరిగిన రోజు ప్రవీణ్‌రావు ఇంటికి ఆదాయపు పన్ను అధికారులుగా వెళ్లిన వారేనని పోలీసులు తెలిపారు. గుంటూరు శ్రీనుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ నిందితులను విజయవాడకు చెందిన సిద్ధార్థ్‌ అనే వ్యక్తి పంపాడని, అతడిని కూడా అరెస్టు చేశామని పోలీసులు పేర్కొంటున్నారు.

అఖిలప్రియ గతంలోనూ..

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కేబినెట్ లో అఖిలప్రియ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆమె హైదరాబాద్, బెంగళూరులో ఎక్కువగా ఉండేవారు. అయితే.. అమరావతికి వెళ్లిన ప్రతిసారీ తన వెంట మందీమార్బలం ఉండాలని కోరుకునేవారట. విజయవాడ, అమరావతి, చుట్టుపక్కల అఖిలప్రియ పర్యటన ఉన్నప్పుడల్లా ఆమె వెంట కొంత మంది ఉండేలా గుంటూరు శ్రీను చూసేవాడని సమాచారం. శ్రీనుకు విజయవాడలోని ఓ మ్యాన్‌పవర్‌ కన్సల్టెన్సీ నిర్వహించే సిద్ధార్థ్‌తో పరిచయం ఉంది. దీంతో.. అఖిలప్రియ పర్యటనకు వచ్చినప్పుడల్లా ఆమె వెంట దాదాపు 20 మంది ఉండేలా చూసేవాడనే ఆరోపణలు ఉన్నాయి. వచ్చిన వారికి ఒక్కొక్కరికీ రోజుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించేవారని సమాచారం.

ఐటీ అధికారులు వారే..!

తాజాగా బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో పాల్గొన్న వారంతా విజయవాడ మ్యాన్‌పవర్‌ కన్సల్టెన్సీనుంచి వచ్చినవారేనని సమాచారం. ఈ కిడ్నాప్ కోసం మనుషులు కావాలని అఖిలప్రియ, భార్గవ్‌రామ్.. గుంటూరు శ్రీనును కోరగా.. శ్రీను సిద్ధార్థ్‌ కు విషయం చెప్పినట్టు సమాచారం. ఇందుకోసం రూ.50 వేలు అడ్వాన్సుగా ఇచ్చి.. విషయం సెటిల్‌ అయిన తర్వాత భారీ మొత్తం ఇస్తానంటూ శ్రీను హామీ ఇచ్చాడనే ఆరోపణలున్నాయి. దీంతో విజయవాడలోని వివిధ కాలనీలకు చెందిన దాదాపు 20మంది యువకుల్ని కూకట్‌పల్లిలోని పార్థ గ్రాండ్‌ హోటల్‌కు పంపాడట సిద్ధార్థ్. వీరు ఐటీ అధికారులు, పోలీసులుగా ఎలా వ్యవహరించాలనే విషయమై యూసుఫ్‌గూడలోని ఎంజీఎం స్కూల్‌ వద్ద భార్గవ్‌రామ్‌ తర్ఫీదు ఇచ్చాడని సమాచారం.

విడతల వారీగా విజయవాడకు..

ఈ 20 మందిలో.. కిడ్నాప్ వ్యవహారం‌ పూర్తి కాగానే కొందరు, బాధితుల్ని విడిచిపెట్టిన తర్వాత మరికొందరు విజయవాడకు వెళ్లిపోయారని సమాచారం. ఈ విషయం ఆరాతీసిన పోలీసులు.. శనివారం సిద్ధార్థ్‌ సహా 15 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఈ నెల 11న అరెస్టయిన అఖిలప్రియ పీఏ బోయ సంపత్‌కుమార్, భార్గవ్‌రామ్‌ వ్యక్తిగత సహాయకుడు నాగరదొడ్డి మల్లికార్జున్‌రెడ్డి, డ్రైవర్‌ డోర్లు బాల చెన్నయ్యలను కస్టడీలోకి తీసుకోవాలని కూడా పోలీసులు నిర్ణయించారు. అదేవిధంగా.. పరారీలో ఉన్న భార్గవ్‌రామ్, అతడి కుటుంబీకులతోపాటు గుంటూరు శ్రీను కోసం గాలింపు ముమ్మరం చేశారు.