Begin typing your search above and press return to search.

టికెట్ కు కోట్లు అడుగుతున్నారట..

By:  Tupaki Desk   |   28 Dec 2018 10:45 AM IST
టికెట్ కు కోట్లు అడుగుతున్నారట..
X
టీడీపీలో సీటు కావాలంటే పరపతి పలుకుబడి ఉంటే సరిపోతుందా.? ఇమేజ్ చూసి బాబుగారు టికెట్ ఇచ్చేస్తారా? లేక టికెట్ కోసం కోట్లకు కోట్లు కుమ్మరించాలా.? ఇదే డౌటు అందరికీ వచ్చేసింది ఈయన మాటలు విని. ఆయన ఆషామాజీ నేత ఏం కాదు.. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్.. ‘ ప్రస్తుత రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ అడిగితే కోట్ల రూపాయలు అడుగుతున్నారు’ అంటూ బాంబు పేల్చారు. టీడీపీలో జరుగుతున్న బాగోతాన్ని పరోక్షంగా కళ్లకు కట్టారు.

మండలి బుద్ద ప్రసాద్.. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉండేవారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అంతర్థానం అయ్యాక టీడీపీలో చేరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే టికెట్ ను ఈయనకు ఇచ్చారు. గెలిచిన ఈయన సీనియర్ కావడంతో బాబు కూడా గౌరవమిచ్చి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా నియమించారు.

అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మండలి బుద్ద ప్రసాద్ తన బాధనంతా తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో వెల్లగక్కారు. ఈ రోజుల్లో ఈ పార్టీకి విలువలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీకి టికెట్ అడిగితే కోట్ల రూపాయలు అడుగుతున్నారని వాపోయారు.

ఎన్నికలకు అంతా సిద్ధమవుతున్న వేళ.. మండలి బుద్ద ప్రసాద్ ఇలా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. బహుశా టీడీపీ టికెట్ అడిగితే ఇలా కోట్లు అడిగారా అన్న చర్చ నడుస్తోంది.