Begin typing your search above and press return to search.

గ్రేటర్ లో ఒకేఒక్క ‘తమ్ముడు’

By:  Tupaki Desk   |   6 Feb 2016 4:12 AM GMT
గ్రేటర్ లో ఒకేఒక్క ‘తమ్ముడు’
X
గ్రేటర్ ఫలితాలు ప్రతిపక్షాలకు ఆశనిపాతంలా మారాయి. తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని భావించిన ప్రాంతాల్లోనే సైకిల్ సత్తా చాటలేకపోయింది. కారుతో పొల్యూషన్.. సైకిల్ తో సొల్యూషన్ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ ఎంత చెప్పినా.. గ్రేటర్ ప్రజలు ఆయన మాటను పెద్దగా పట్టించుకోలేదు. గ్రేటర్ బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్క డివిజన్ ను మాత్రమే సొంతం చేసుకోగలిగింది.

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునే కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని ఓటర్లు తమ ఓట్లను సైకిల్ కు వేయటంతో.. ఆ పార్టీ ఈ ఒక్క డివిజన్ ను మాత్రమే చేజిక్కించుకోగలిగింది. ఈ స్థానం కూడా దక్కకుంటే దారుణమైన అవమానం మూటగట్టుకునే పరిస్థితి. కేపీహెచ్ బీ కాలనీ డివిజన్ లో మందడి శ్రీనివాసరావు విజయం తమ్ముళ్లకు ఎంతోకొంత ఉపశమనం లభించిందనే చెప్పాలి.

గులాబీ సునామీలో పార్టీలన్నీ కకావికలమైన నేపథ్యంలో.. గ్రేటర్ ప్రజలంతా కారుతో ముందుకు సాగేందుకు రెఢీ అయిన వేళ.. కేపీహెచ్ బీ ఫలితం అందుకు భిన్నంగా ఉండటం టీటీడీపీ ఘోర అవమానం నుంచి తప్పుకున్న దుస్థితి. ఇక.. కేపీహెచ్ బీ డివిజన్ నుంచి విజయం సాధించిన మందడి గెలుపు ఒకదశలో సందేహాలకు తావిచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి పోటాపోటీగా ఓట్లు రావటంతో తమ్ముళ్లకు టెన్షన్ పట్టుకుంది. చివరకు 2,735 ఓట్లతోమందడి విజయం సాధించటంతో తమ్ముళ్లు నోటి వెంట హమ్మయ్య అన్న మాట వచ్చింది. గ్రేటర్ లో ఒకే ఒక్క తమ్ముడిగా నిలిచిన మందడి శ్రీనివాసరావు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నారు.