Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను అడ‌గ‌కుండా..కేటీఆర్‌ ను అడుగుడేంది?

By:  Tupaki Desk   |   17 Sep 2018 10:51 AM GMT
కేసీఆర్ ను అడ‌గ‌కుండా..కేటీఆర్‌ ను అడుగుడేంది?
X
తెలంగాణ‌లో అధికార లాబీ అడ్ర‌స్ మారుతోందా? అంటే.. అవున‌నే చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేని విధంగా సాగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే.. ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేయ‌టం మానేసి ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా పేరొందిన తాజా మాజీ మంత్రి కేటీఆర్ ముందుకు వెళ్ల‌టం గ‌మ‌నార్హం.

మిర్యాల‌గూడులో చోటు చేసుకున్న ప‌రువు హ‌త్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతానికి సంబంధించి తాజా డిమాండ్ ఒక‌టి సీఎంకు కాకుండా తాజా మాజీ మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్ల‌టం విశేషం.

కులం త‌క్కువ వాడిని కుమార్తె ప్రేమించింద‌న్న ఆగ్ర‌హానికి గురైన మారుతి రావు.. కిరాయి మూక‌తో పాశ‌వికంగా చంపేయించ‌టం.. అందుకు కోటి రూపాయిల వ‌ర‌కూ డీల్ కుద‌ర్చుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసును ప్ర‌త్యేక కేసుగా ప‌రిణ‌గించి ప్ర‌త్యేక కోర్టును ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్‌ ను తెర మీద‌కు తెచ్చారు. అంతేకాదు.. మిర్యాల‌గూడ సెంట‌ర్లో హ‌త్య‌కు గురైన ప్ర‌ణ‌య్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ ను ఎమ్మార్పీఎస్ అధినేత మంద‌కృష్ణ మాదిగ తెర మీద‌కు తెచ్చారు. ప్ర‌ణ‌య్ హ‌త్య కేసులో రాజ‌కీయ.. ఆర్థిక అండ‌దండ‌లున్న నిందితుడు శిక్ష నుంచి త‌ప్పించుకునే ప‌రిస్థితి ఉంద‌ని.. ఈ కేసును హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జి ద్వారా విచార‌ణ జ‌రపాల‌న్నారు. ఈ కిరాయి హ‌త్య‌లో విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత‌ను ఎందుకు స‌స్పెండ్ చేయ‌టం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ప్ర‌ధాన నిందితుడు మారుతిరావు అన్ని రాజ‌కీయ పార్టీల‌ను త‌న గుప్పిట్లో పెట్టుకున్నాడ‌ని విమ‌ర్శించారు. ప్ర‌ణ‌య్.. అమృత‌ల‌కు ప్ర‌మాదం ఉంద‌ని తెలిసినా.. పోలీసులు కాపాడేందుకు ఎందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌ణ‌య్ హ‌త్య‌కు గురి కావ‌టానికి గంట ముందు వేములప‌ల్లి క‌ట్ట మీద డీఎస్పీతో పావుగంట పాటు మాట్లాడ‌టం వెనుక ఉద్దేశం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఈ ఘ‌ట‌న‌లో పాల్గొన్న నిందితులంద‌రికి క‌ఠిన‌మైన శిక్ష ప‌డాల‌ని మంద‌కృష్ణ కోరారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మిర్యాల‌గూడలో హ‌త్య‌కు గురైన ప్ర‌ణ‌య్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాలంటూ మంద‌కృష్ణ కేసీఆర్ ను వ‌దిలేసి.. కేటీఆర్ కు డిమాండ్ చేయ‌టం చూస్తే.. తెలంగాణ రాజ‌కీయాల్లో ఎవ‌రి హ‌వా ఎలా న‌డుస్తుందో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.