Begin typing your search above and press return to search.

కేసీఆర్ లెక్కల్ని కొత్త కోణంలో చెప్పిన మందకృష్ణ

By:  Tupaki Desk   |   21 Sept 2019 11:07 AM IST
కేసీఆర్ లెక్కల్ని కొత్త కోణంలో చెప్పిన మందకృష్ణ
X
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు మందకృష్ణ. మాదిగల హక్కులతో పాటు.. పలు సామాజిక అంశాల మీద అప్పుడప్పడు గళం విప్పే ఆయన సంచలన వ్యాఖ్యలకు.. కొత్త తరహా ఉద్యమాలకు సుపరిచితుడిగా పేరుంది. ఏదైనా అంశం మీద ఆందోళనలకు ఆయన పిలుపునిస్తే వేలాదిగా రోడ్ల మీదకు రావటం గతంలో చూశాం. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు మందకృష్ణ.

కేసీఆర్ సామాజిక సమీకరణలు ఎలా ఉంటాయన్న విషయాన్ని తాజాగా ఆయన వెల్లడించిన వివరాలు ఆసక్తికరంగానే కాదు హాట్ టాపిక్ గా మారనున్నాయి. ఆయన మాటలు రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ పరిణామాలకు తెర తీసేలా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న రాష్ట్ర మంత్రివర్గాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ చేస్తున్న ఆయన.. అందుకు తగ్గ అంశాల్ని లేవనెత్తటం గమనార్హం. ఆయన చేసిన వ్యాఖ్యల్లో కీలకమైన అంశాల్ని చూస్తే..

% వెలమల మీద ప్రేమతో నాలుగు మంత్రి పదవులు.. రెడ్ల మీద భయంతో ఆరు మంత్రి పదవులు కేటాయించటం ఏమిటి?

% తెలంగాణ రాష్ట్రంలో 12 శాతం ఉన్న మాదిగలు.. వాటి ఉప కులాలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు. ఎమ్మెల్యేలుగా.. మండలి సభ్యులుగా 12 మంది మాదిగలు.. వారి ఉప కులాలు ఉన్నా సామాజిక న్యాయం జరగటం లేదు.

% కడియం శ్రీహరికి 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా.. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోకపోవటం ఏమిటి? సమర్థుడిగా పేరున్న ఆయనకు చోటు ఎందుకు దక్కలేదు?

% తప్పు చేయకుండానే రాజయ్యను తొలగించారు. ఏ తప్పు చేయలేదని మళ్లీ టికెట్ ఇచ్చినప్పుడు.. ఎన్నికల్లో గెలిచిన రాజయ్యకు మళ్లీ మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు?

% హరీశ్ తర్వాత అత్యధిక మెజార్టీతో గెలిచిన వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరేరి రమేశ్ కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు?

% తెలంగాణ ఉద్యమంలో కీలకమని చెప్పే రసమయికి మంత్రివర్గంలో చోటు ఎందుకు దక్కలేదు?

% ఏపీలో 175 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు దళితులకు మంత్రి పదవులు లభించాయి. 119 మంది తెలంగాణ ఎమ్మెల్యేల్లో సంఖ్యా పరంగా మూడు మంత్రి పదవులు దళితులకు ఇవ్వాలి. కానీ. ఒక్కరికే పదవి లభించింది.

% టీఆర్ ఎస్ తరఫున ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఒక్క దళితుడికి కూడా ప్రాధాన్యం లభించలేదు. కేవలం రెండు కులాల కోసం కొన్ని కులాలకు ఒకటి చొప్పున పదవి ఇచ్చి.. చాలా కులాలకు మొండిచేయి చూపారు.