Begin typing your search above and press return to search.

ఆవేశంలో 35 కాదు.. 36 ముక్క‌లు చేసినా త‌ప్పులేదు.. ఆఫ్తాబ్‌కు యువ‌కుడు స‌పోర్ట్‌

By:  Tupaki Desk   |   26 Nov 2022 2:30 AM GMT
ఆవేశంలో 35 కాదు.. 36 ముక్క‌లు చేసినా త‌ప్పులేదు.. ఆఫ్తాబ్‌కు యువ‌కుడు స‌పోర్ట్‌
X

దేశరాజధాని ఢిల్లీలో వెలుగుచూసిన ‘శ్రద్ధా వాకర్ హత్యోదంతం’ యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. త‌నను న‌మ్మి వ‌చ్చిన‌ ప్రియురాలు శ్రద్ధాను ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమిన్ పూనావాలా కిరాతకంగా హత్య చేయడం.. మృతదేహాన్ని 35 ముక్కలుగా ఖండించి కండ‌కో చోట‌ పడేసిన తీరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంతటి దారుణచర్యను ఎవ‌రూ సమర్థించలేదు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్ జిల్లా సికంద్రాబాద్‌కు చెందిన వికాస్ కుమార్ అనే యువకుడు అఫ్తాబ్ అమీన్‌ను సమర్థించాడు.

ఆవేశంలో ఉన్నప్పుడు ఇలా చర్యలకు పాల్పడుతుంటారని, కోపంలో ఉన్నప్పుడు 35 ముక్కలే కాదు.. 36 ముక్కలు కూడా కావొచ్చని వ్యాఖ్యానించాడు. ఆఫ్తాబ్ చేసిన సరైదేనని సమర్థించాడు. ‘నువ్వైనా ఇలాగే చేస్తావా?’ అని ప్రశ్నించగా.. ఇలాంటి పనులు ఆవేశంలో జరుగుతుంటాయని, ఇదేమీ పెద్ద విషయం కాదని అతడు బదులిచ్చాడు. ``ఆ స‌మ‌యంలో నేనుంటే.. 35 కాదు 36 ముక్క‌లు చేసేవాడిని`` అని బ‌దులిచ్చాడు. దీంతో అత‌డిని ఇంట‌ర్వ్యూ చేసిన రిపోర్టర్ ఆశ్చ‌ర్య పోయాడు.

కాగా, ఈ ఇంట‌ర్వ్యూ లోక‌ల్ టీవీల్లో రావ‌డంతో స‌ద‌రు వికాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడికి నేరచరిత్ర ఉందని బులంద్‌షెహర్ ఎస్‌పీ శ్లోక్ కుమార్ వెల్లడించారు. దొంగతనాలు, అక్రమాయుధాలు కలిగివుండడంతో బులంద్‌షెహర్, నోయిడా నగరాల్లో ఇతడిపై కేసులున్నాయని వివరించారు. తన వ్యాఖ్యలు ఇంతటి పరిణామానికి దారితీస్తాయని తెలియదని నిందిత యువకుడు అరెస్ట్ అనంతరం చెప్పారు.

‘‘నన్ను చంపేస్తారేమోనని భయంగా ఉంది. ఇక్కడో లేదా జైళ్లోనో చంపేస్తారు’’ అని ఆందోళన వ్యక్తం చేశాడు. తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నావా అని ప్రశ్నించగా లేద‌న్నాడు. కాగా, దాదాపు ఆరు నెలలక్రితం ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య జరిగింది. ప్రియురాలు శ్రద్ధాను గొంతునులిమి చంపేసిన అఫ్తాబ్.. ఆ తర్వాత మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. ఆ ముక్కలను ఫ్రిజ్‌లో పెట్టి 18 రోజుల వ్యవధిలో అన్నింటినీ అటవిలో పడేసిన విషయం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.