Begin typing your search above and press return to search.

పరువు హత్యలో మరణించిన హేమంత్ జగన్ వీరాభిమాని?

By:  Tupaki Desk   |   28 Sept 2020 11:15 AM IST
పరువు హత్యలో మరణించిన హేమంత్ జగన్ వీరాభిమాని?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన చందానగర్ పరువు హత్యలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అతడి హత్య జరిగి మూడు రోజులు అవుతున్నా.. హేమంత్ మొబైల్ ఫోన్ లభ్యం కాలేదు. దానిని సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్లు చెబుతున్నా.. ఫోన్ ఎందుకు దొరకలేదన్నది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ హత్యలో కీలక నిందితులు ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

గొంతుకు తాడును బిగించటం వల్లే హేమంత్ మరణించినట్లుగా పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. తన భర్త హేమంత్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిగా పేర్కొన్నారు. ఈ కేసులో తమకు న్యాయం చేసేలా సీఎం జగన్ ను ఆమె కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తమకు అండగా నిలవాలని.. కిరాతకంగా వ్యవహరించిన తన తల్లిదండ్రుల్ని శిక్షించాలని అవంతి డిమాండ్ చేస్తున్నారు.

తమ ప్రేమ విషయం ఏడు నెలల క్రితం ఇంట్లో తెలిసిందని.. అప్పటి నుంచి తనను ఉద్యోగం మాన్పించి.. ఇంటికే పరిమితం చేశారన్నారు. సెల్ ఫోన్ లాక్కొని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేశారన్నారు. తాను ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతానన్న భయంతో ఇంటి చుట్టూ.. బయట సీసీ కెమేరాలతో నిఘా ఏర్పాటు చేశారని.. 24 గంటలు తానేం చేస్తున్నానన్న విషయాన్ని కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు గమనిస్తూ ఉండేవారన్నారు.

జూన్ ఆరున తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవమని.. ఆ రోజున వారిని బాధ పెట్టటం ఇష్టం లేక పెళ్లిని వాయిదా వేసకున్నామన్నారు. పెళ్లికి ముందు రోజు రాత్రి హేమంత్ కారులో వచ్చారని.. ఆ సమయంలో ఇంట్లో కరెంటు పోవటంతో తాను తేలికగా బయటకు వచ్చినట్లుగా చెప్పారు. పెళ్లి చేసుకున్న తర్వాత చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాల్ని పిలిపించి మాట్లాడమని సీపీ సజ్జనార్ పోలీసులకు చెప్పినట్లు చెప్పారు.

ఇన్ స్పెక్టర్ రవీందర్ రెడ్డి.. మరో ఎస్ ఐలు ఇద్దరూ తమ తల్లిదండ్రులకు అనుకూలంగానే మాట్లాడారన్నారు. సోలీసుల ముందే తన తల్లిదండ్రులు దారుణంగా తిట్టారని.. తన అత్తను కూడా అసభ్యపదజాలంతో దూషించారన్నారు. తనకు ప్రాణహాని ఉందని చందానగర్ పోలీస్ స్టేషన్ లో జూన్ 15న ఫిర్యాదు చేశానని.. అప్పుడే పోలీసులు స్పందించినా ఘోరం జరిగి ఉండేది కాదన్నారు.