Begin typing your search above and press return to search.

భార్య ఓటు వేయ‌లేద‌ని..భ‌ర్త‌తో చాటింపు!

By:  Tupaki Desk   |   7 July 2017 10:37 AM GMT
భార్య ఓటు వేయ‌లేద‌ని..భ‌ర్త‌తో చాటింపు!
X
అధికారమిచ్చిన అహంకారంతో కొంద‌రు పెద్ద మ‌నుషులు అత్యంత హేయమైన చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. మానవత్వం మరిచి సాటి మ‌నుషుల ప‌ట్ల అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు. ప‌ద‌విలో ఉండి బడాబాబులుగా చలామణీ అవుతున్న కొందరి దుర్మార్గానికి ప‌రాకాష్ఠ ఈ ఘ‌ట‌న‌. కొంద‌రు పెద్ద మ‌నుషులు తాము బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థికి ఓ మ‌హిళ ఓటు వేయ‌లేద‌నే కార‌ణంతో ఆమె భ‌ర్త‌ను ఘోరంగా అవ‌మానించారు. ఒడిసాలో ఈ దారుణ ఘ‌ట‌న జ‌రిగింది.

భార‌త‌దేశంలోని ప్రతీ పౌరుడికి ఓటు హ‌క్కును రాజ్యాంగం ప్ర‌సాదించింది. త‌మ‌కు నచ్చిన వారికి ఓటు వేసే స్వేచ్ఛ‌ను ఇచ్చింది. కానీ, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆ హ‌క్కును స‌ద్వినియోగం చేసుకునే స్వేచ్ఛ పౌరుల‌కు రాలేదు. ఒడిస్సాలోని అనుగుల్ పరిధిలో ఉన్న రగుడియపడలో మల్లికా సాహూ అనే వార్డు మెంబర్ స్థానిక ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కును వినియోగించుకుంది. అయితే, గ్రామ పెద్దలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఆమె ఓటు వేయలేదు.

రాజ్యాంగం ప్ర‌కారం త‌న‌కు సంక్ర‌మించిన హ‌క్కుతో తనకు నచ్చిన అభ్యర్థికి ఓటువేసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఆమె చేసిన ప‌నిని ఘోరమైన తప్పుగా పరిగణించారు. ఆమెకు రూ.50వేల జరిమానా విధించారు. తాను ఆ జరిమానా చెల్లించలేనని చెప్పడంతో కోపోద్రిక్తుల‌య్యారు. స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునే శిక్ష‌ను ఆమె భ‌ర్త‌కు విధించారు.

తన భార్య చేసిన పనికి క్షమించమని ఊరంతా డప్పు కొట్టుకుంటూ అడగాలని ఆమె భర్త‌కు శిక్ష విధించారు. అధికారంలో ఉన్న గ్రామ పెద్దలను ఎదిరించే ధైర్యం లేక ఆమె భ‌ర్త ఊరంతా డ‌ప్పు కొట్టాడు. ఏ త‌ప్పు చేయ‌కుండానే ఆ భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ ఘోర అవ‌మానానికి గుర‌య్యారు. ఈ విషయం మీడియాకు, పోలీసులకు తెలిసింది. అయితే, గ్రామ పెద్దలు అలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌లేదంటూ భుజాలు బుకాయిస్తున్నారు.