Begin typing your search above and press return to search.

గవర్నమెంట్ గుంతలు ప్రాణం తీశాయా?

By:  Tupaki Desk   |   4 Dec 2021 1:05 PM
గవర్నమెంట్ గుంతలు ప్రాణం తీశాయా?
X
ఏపీలో కొత్త రోడ్లు వేయడం లేదని, ఆల్రెడీ ఉన్న రోడ్లు అధ్వాన్నంగా తయారైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అతుకులు...గతుకులు ఉన్న రోడ్లపై ప్రయాణిస్తూ చాలామంది వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారని, నడుము నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కనిగిరిలో గుంతల రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారుడు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది.

కనిగిరి నగర పంచాయతీ పరిధిలో ఉన్న కొత్తూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే, ఈ ప్రమాదం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. పామూరు నుంచి కనిగిరికి మోటార్ బైక్ పై వస్తున్న వ్యక్తి ప్రమాదానికి గురై మరణించాడు. రోడ్డుపై గుంతలు అధికంగా ఉండడంతో బైక్ ను అదుపు చేయలేక కిందపడ్డాడు. అయితే, అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఆ వ్యక్తిపై నుంచి వెళ్లడంతో స్పాట్ లోనే మృతి చెందాడు.

అయితే, ఈ ఘటన రోడ్డుపై గుంతల వల్లే జరిగిందా? మరేదైనా కారణం వల్ల జరిగిందా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏపీలో రోడ్లు గుంతలు పడి అధ్వాన్నంగా ఉన్నాయని టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, రోడ్లపై గుంతలు పూడ్చేందుకు పవన్ కల్యాణ్ నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు.