Begin typing your search above and press return to search.

పాతబస్తీలో ​అ​ రాచకాలు పట్టవా ఓవైసీ బ్రదర్స్

By:  Tupaki Desk   |   3 Oct 2015 5:12 AM GMT
పాతబస్తీలో ​అ​ రాచకాలు పట్టవా ఓవైసీ బ్రదర్స్
X
దేశంలో ఎక్కడేం జరిగినా స్పందించే ఓవైసీ బ్రదర్స్.. తమ సొంత ఇలాకాలో ఇష్టారాజ్యంగా ఉన్నా అస్సలు పట్టించుకోరు. దేశంలో జరిగే అంశాల మీద రియాక్ట్ అవ్వొద్దని చెప్పట్లేదు కానీ.. వాటి కంటే ముందు తాము మాత్రమే ప్రాతినిధ్యం వహించే పాతబస్తీలో పరిస్థితుల్ని ఎందుకు బాగు చేసుకోరన్నది ప్రశ్న. ఎవరూ పెద్దగా మాట్లాడరు.. ప్రభుత్వాలు పట్టించుకోవు కానీ.. దందాలు.. రౌడీయిజంతో పాటు మరిన్ని చీకటి కోణాలు పాతబస్తీలో కనిపిస్తాయన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది.

వీటిపై ఎప్పుడూ పెదవి విప్పిన పాపాన పోరు ఓవైసీ బ్రదర్స్. ఎవరి వరకో ఎందుకు.. ఓవైసీ బ్రదర్స్ లోని చిన్నవాడైన అక్బరుద్దీన్ మీద పట్టపగలు హత్యాయత్నం జరగటాన్ని మర్చిపోలేం. ఇలాంటివెన్నో పాతబస్తీలో కామన్ అన్నట్లుగా సాగుతుంటాయి. వీటి ప్రక్షాళన కోసం అటు ప్రభుత్వాలే కాదు.. అధికారులు సైతం నిర్ణయాలు తీసుకోవటానికి జంకుతుంటారు. అంతగా తమ గుప్పిట్లో ఉంచుకునే ఓవైసీ బ్రదర్స్.. హైదరాబాద్ పాతబస్తీలోని ఆరాచకాలకు తామే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఒకేరోజు చోటు చేసుకున్న రెండు ఘటనలు చూస్తే.. పాతబస్తీలో ప్రశాంతత ఎంతన్నది ఇట్టే తెలుస్తుంది. సినిమాల్లో మాదిరి.. వీధుల్లో సాగిన సమరం.. హత్యలు చూస్తే.. పాతబస్తీలో ప్రభుత్వం అన్నది ఒకటి ఉందా అన్న సందేహం కలగక మానదు. శుక్రవారం చోటు చేసుకున్న రెండు ఘటనలు చూస్తే..

బాలాపూర్ బార్కస్ కు చెందిన యువకుల మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. జట్కాబండి విషయంలో ఏర్పడిన చిన్న వివాదం హత్యల వరకూ వెళ్లింది. జట్కాబండికి సంబంధించిన వివాదంలో అలీ అఫ్సారీ.. సాదిక్ అనే ఇద్దరు యువకుల్ని మాట్లాడుకుందామని పిలిచిన ఇబ్రహీంపై కత్తులతో దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన ఇబ్రహీం.. తాను కత్తి పట్టుకొని రోడ్డుపై తలబడ్డారు. ఈ ముగ్గురు కత్తుల స్వైర విహారంతో అలానే సాగింది. అడ్డుకున్న నాథుడే లేడు.

ఈ పోరాటంలో అఫ్సారీ కుప్పకూలిపోయి.. ఆసుపత్రికి తరలిస్తున్న మార్గమధ్యంలోనే మరణించాడు. ఇక.. సాధిక్.. ఇబ్రహీంలకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సినిమాల్లో మాత్రమే కనిపించే దృశ్యం ఇబ్రహీం.. అఫ్సారీ దాడిలో చోటు చేసుకుంది. ఇబ్రహీంను అఫ్సారీ కత్తితో పొడిస్తే.. తన శరీరం లోపల దిగబడిన కత్తిని బయటకు తీసి మరీ అఫ్సారీని పొడిచేయటం.. దాంతో అతగాడు కుప్పకూలి మరణించటం గమనార్హం. అనంతరం.. తీవ్రగాయాలైన ఇబ్రహీం.. సాదిక్ లను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ముగ్గురు యువకులూ రౌడీ షీటర్ల కుటుంబానికి చెందిన వారే కావటం గమనార్హం. తాజా ఉదంతంతో బార్కస్ ఉద్రిక్తతతో ఉడికిపోతోంది.

ఇదిలా ఉంటే.. బార్కస్ లో ఈ ఘటన చోటు చేసుకోవటానికి గంట ముందు పాతబస్తీకి చెందిన కొందరు రౌడీలు లక్డీకాఫూల్ లో హల్ చల్ చేశారు. రంగారెడ్డి కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో.. తెలంగాణ డీజీపీ కార్యాలయానికి దగ్గర్లో చోటు చేసుకున్న ఈ హత్య సంచలనం సృష్టిస్తోంది. పోలీసులంటే ఏ మాత్రం భయం లేనట్లుగా హత్య చేసేసి తమ దారిన తాము వెళ్లిపోవటం చూస్తే.. పాతబస్తీ రౌడీ మూక ఎంతగా పెట్రేగిపోతుందో ఇట్టే అర్థమవుతుంది.

గిల్ట్ నగల వ్యాపారం చేసే సోహైల్ ను డబ్బులు ఇవ్వాలని పాతబస్తీకి చెందిన ఇద్దరు రౌడీలు వేధించారు. దీంతో.. సోహైల్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఇద్దరి రౌడీల్ని స్టేషన్ కు పిలిపించిన పోలీసులు వారిని హెచ్చరించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వ్యాపారిని రౌడీలు ఇద్దరూ వెంటాడగా.. ప్రాణభయంతో వారి నుంచి తప్పించుకొని లక్డీకాపూల్ రైల్వే స్టేషన్ మీదుగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దాటి దగ్గర్లోని హోటల్ సంధ్యలోకి పరిగెత్తాడు. అయినా వదలని రౌడీలు ఇద్దరు.. అందరూ చూస్తుండగా సదరు వ్యాపారిన దారుణంగా హతమార్చారు.

నడిరోడ్డు మీద జరిగిన ఈ ఘటనల అనంతరం తాపీగా వచ్చిన పోలీసులు.. సీసీ పుటేజ్ ను స్వాధీనం చేసుకొని రౌడీల కోసం గాలింపు చేపట్టారు. దేశంలో ఎక్కడో ఏదో జరుగుతుందని గొంతు చించుకునే ఓవైసీ సోదరులు.. తమ సొంత ఇలాకాలో సాగుతున్న ఈ ఆరాచకాలపై ఏమంటారు..?