Begin typing your search above and press return to search.

ప్లీజ్ డాక్ట‌ర్‌.. చివ‌రిసారిగా బిర్యానీ తింటా

By:  Tupaki Desk   |   25 Sep 2018 9:57 AM GMT
ప్లీజ్ డాక్ట‌ర్‌.. చివ‌రిసారిగా బిర్యానీ తింటా
X
ప్ర‌పంచ‌వ్యాప్త‌ ప్రాచుర్యం పొందిన క‌మ్మ‌ని వంట‌కాల్లో బిర్యానీ ఒక‌టి. దాన్ని రుచి చూసి అద‌ర‌హో అన‌ని వారు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. హైద‌రాబాద్‌లో అయితే బిర్యానీ మ‌రీ ఫేమ‌స్‌. ఎక్క‌డెక్క‌డివారు భాగ్య‌న‌గ‌రానికి వ‌చ్చినా.. దాన్ని రుచి చూడాల్సిందే. దుబాయ్‌కి చెందిన ఓ ఇంజినీర్‌ కు కూడా బిర్యానీ అంటే మ‌హా ఇష్టం. ఎంతగా అంటే.. ఉద‌ర క్యాన్స‌ర్‌ తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న పొట్ట తొల‌గించేందుకు వైద్యులు సిద్ధ‌మ‌వుతుండ‌గా.. చివ‌రిసారిగా బిర్యానీ తిన్నాకే ఆప‌రేష‌న్ చెయ్యండి డాక్ట‌ర్ అంటూ వేడుకునేటంత‌!

దుబాయ్‌ కి చెందిన గులామ్ అబ్బాస్ ఇటీవ‌ల అక‌స్మాత్తుగా బ‌రువు త‌గ్గాడు. ప‌లుమార్లు వాంతులు చేసుకున్నాడు. దీంతో వెంటనే డాక్టర్లను సంప్ర‌దించాడు. తాను ఉద‌ర క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నాన‌ని నిర్ధార‌ణ అవ్వ‌డంతో క‌న్నీరుమున్నీర‌య్యాడు. వ్యాధి ఇప్ప‌టికే ముదిరింద‌ని.. ప్రాణం కాపాడాలంటే ఆప‌రేష‌న్ చేసి పొట్ట తీసెయ్యాల్సిందేన‌ని డాక్ట‌ర్లు గులామ్‌కు స్ప‌ష్టం చేశారు. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో గులామ్ ఆప‌రేష‌న్ చేయించుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అయితే, ఆప‌రేష‌న్‌ కు ముందు అత‌డి కోరిక విని వైద్యులు ఆశ్చ‌ర్య‌పోయారు. అదేంటంటే.. పొట్ట తీసేసేముందు చివ‌రిసారిగా బిర్యానీ తిన‌డం. బిర్యానీ స్పైసీగా ఉంటుంది. పొట్ట తీసేసిన త‌ర్వాత గులామ్ ఉప్పూకారం పెద్ద‌గా లేని మామూలు వంట‌లే ఆర‌గించాల్సి ఉంటుంది. అందుకే బిర్యానీపై త‌న‌కున్న మ‌మ‌కారంతో అలా కోరాడు. అత‌డి కోరిక‌ను వైద్యులు మ‌న్నించారు. దీంతో గులామ్ భార్య బిర్యానీ చేసి భ‌ర్త‌కు క‌డుపు నిండా తినిపించింది. ఆపై వైద్యులు ఆప‌రేష‌న్ చేసి గులామ్ పొట్ట‌ను తీసేశారు. ఇక‌పై అత‌డు తినే ఆహారం నేరుగా చిన్న‌పేగుల్లోకి వెళ్తుంద‌ని.. అక్క‌డే జీర్ణ‌మ‌వుతుంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. అత‌డి ప్రాణానికి ముప్పేమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఏది ఏమైనా.. బిర్యానీపై గులామ్‌కు ఉన్న ప్రేమ మాత్రం సూప‌ర్ క‌దూ..!