Begin typing your search above and press return to search.

మమత మదిలో థర్డ్ ఫ్రంట్

By:  Tupaki Desk   |   20 May 2016 5:01 AM GMT
మమత మదిలో థర్డ్ ఫ్రంట్
X
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ చావు దెబ్బతిందని సంబర పడుతున్న బీజేపీకి కూడా ముందుముందు కష్టకాలం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో అస్సాంలో తొలిసారి అధికారం అందుకుని చరిత్ర సృష్టించిన సంతోషంలో బీజేపీ ఉంది. మరోవైపు తమిళనాడులోనూ తమకు అనుకూలమైన అన్నా డీఎంకే అధికారంలోకి వచ్చింది. బెంగాల్ లోనూ తృణమూల్ అధికారంలోకి వచ్చింది. ఎక్కడా కాంగ్రెస్ అన్నది కనిపించలేదు. ఒక్క పాండీలో మాత్రమే కాంగ్రెస్ - డీఎంకేల కూటమి గెలిచింది.. అది చాలా చిన్న ప్రాంతం కావడంతో పెద్దగా ప్రాధాన్యం లేదు. పైగా కాంగ్రెస్ పాలనలో ఉన్న కేరళ - అస్సాంలను ఆ పార్టీ కోల్పోవడంతో బీజేపీ తెగ సంతోషిస్తోంది. కానీ.... బెంగాల్ ఫలితం చూసినవారు మాత్రం బీజేపీకి ముందుముందు ముసళ్ల పండగ ఉందని అంటున్నారు. మమత ఇప్పటికి ఒకట్రెండు సార్లు బీజేపీకి పార్లమెంటులో అండగా నిలబడిన సందర్భాలు చూసి ఆ పార్టీ మద్దతు తమకే అని బీజేపీ అనుకుంటున్నా వాస్తవాలు అలా ఉండవని చెబుతున్నారు. మమత గతసారి కంటే బలం పెంచుకోవడంతో ఆమె ఇప్పటికే తృతీయ ఫ్రంట్ దిశగా ఆలోచిస్తోందని అంటున్నారు.

పశ్చిమ బెంగాల్‌ లో 213 సీట్లను కైవసం చేసుకుని రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ భావ సారూప్యత గల పార్టీలతో కలిసి జాతీయస్థాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్‌ పై దృష్టి కేంద్రీకరిస్తూనే జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి. ‘నేను సగటు మనిషిని. ఇలాగే ఉండాలనుకుంటున్నాను, అయితే మాతృదేశమంటే నాకెంతో ప్రేమ. దేశాభివృద్ధి కోసం ఎంతో కొంత చేయాలి కదా?’ అని ఎన్నికల ఫలితాల అనంతరం మమత వ్యాఖ్యానించడం ఇప్పుడు కొత్త అర్థాలు తీయడానికి కారణమవుతోంది. అభివృద్ధి సాధించిన భారతదేశాన్ని చూడాలనుకుంటున్నాననే అభిలాషను ఆమె వ్యక్తం చేయటం గమనార్హం.

‘దేశాభివృద్ధి కోసం చేయగలిగినంత చేస్తాను, అది చిన్నదైనా సరే చేసి తీరుతాను’ అని ఆమె స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తి లేదంటూనే, దేశాభివృద్ధి కోసం భావసారూప్యత గల పార్టీలతో కలిసి పనిచేస్తానని ఆమె స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లో నాకు చాలామంది మిత్రులున్నారు, వారందరితో కలిసి పనిచేస్తానని ఆమె ప్రకటించటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు - తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ - బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్ - అన్నా డిఎంకె అధ్యక్షురాలు జయలలిత - బిఎస్‌ పి అధ్యక్షురాలు మాయావతితో జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తానని ఆమె చెప్పారు. దేశాభివృద్ధి కోసం ఏం చేయాలనేది స్నేహితులందరితో కూర్చోని చర్చిస్తానన్నారు.

బెంగాల్ లో తిరుగులుని బలం సాధించడం... కేంద్రంలోని ప్రభుత్వాలతో ఆమెకు ఘర్షణలు ఉంటుండడంతో ఆమె మూడో కూటమి దిశగా గట్టి ప్రయత్నమే చేస్తారని తెలుస్తోంది. ఆమె స్వయంగా ప్రధాని కావాలని అనుకోకపోయినా ఇతర పార్టీల నేతలకు ఆ అవకాశం ఇచ్చి వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా మారుతారని భావిస్తున్నారు. ఇది బీజేపీకి ఇబ్బందికరమేనని చెబుతున్నారు.