Begin typing your search above and press return to search.

రంజాన్ నాడు..నీతి ఆయోగ్ మీటింగా మోడీ?

By:  Tupaki Desk   |   9 Jun 2018 5:29 AM GMT
రంజాన్ నాడు..నీతి ఆయోగ్ మీటింగా మోడీ?
X
లేనిపోని విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు.. అనుమానాలు క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌టంలో ప్ర‌ధాని మోడీ ముందుంటారా? అన్న అనుమానం వ‌చ్చేలా కొన్ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హిందువేత‌రులకు చెందిన ముఖ్య‌మైన పండుగ‌ల స‌మ‌యంలో కీల‌క‌మైన భేటీలు నిర్వ‌హించేందుకు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల మీద విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

క్రిస్ మ‌స్ సంద‌ర్భంగా జాతీయ స్థాయిలో ఉన్న‌తాధికారుల‌తో మీటింగ్ నిర్వ‌హించే మోడీ.. తాజాగా రంజాన్ వేళ కీల‌క‌మైన నీతి అయోగ్ స‌మావేశాన్ని నిర్వ‌హించేందుకు డేట్ ఫిక్స్ చేయ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఈ నెల 16న (రంజాన్ కూడా అదే రోజు) నీతి అయోగ్ సాధార‌ణ మండ‌లి స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

ఈ స‌మావేశానికి నీతి అయోగ్‌లో స‌భ్యులుగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌రు కావాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్రాల మ‌ధ్య ప‌న్నుల ఆదాయంపై స‌మీక్ష‌.. రాష్ట్రాల‌కు గ్రాంట్ల విష‌యంలో నీతి ఆయోగ్ కు కేంద్రం ఇచ్చిన టుర్మ్స్ ఆఫ్ రిఫ‌రెన్స్ పైనా ప‌లు రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నాయి.

తెలంగాణ‌తో పాటు ద‌క్షిణాది రాష్ట్రాలు.. పశ్చిమ బెంగాల్‌.. ఢిల్లీ.. త‌దిత‌ర రాష్ట్రాలు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతున్నాయి. రాష్ట్రాల‌కు నిధులు పంపిణీ విష‌యంలో 1971 జ‌నాభా ప్రాతిప‌దిక‌న కాకుండా 2011 నాటి జ‌నాభా లెక్క‌ల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని కోరుతున్నారు. రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ముస్లింల ప‌ర్వ‌దిన‌మైన రంజాన్ పండుగ నాడు స‌మావేశం పెట్ట‌టం ఏమిటంటూ ప‌లువురు ముఖ్య‌మంత్రులు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

స‌మావేశాన్ని జూన్ 16 కాకుంటే.. ఆ త‌ర్వాతి రోజు కానీ మ‌రో రోజు కానీ నిర్వ‌హించొచ్చ‌ని.. రంజాన్ రోజు అయితే తాను మీటింగ్‌కు రాలేన‌ని మ‌మ‌తా తేల్చి చెప్ప‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. పండ‌గ రోజు ముఖ్య‌మైన మీటింగ్ పెట్ట‌టంలో అంత‌ర్యం ఏమిట‌న్న ప్ర‌శ్న బ‌లంగా వినిపిస్తున్న నేప‌థ్యంలో దీనిపై ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేస్తుందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఏమిటంటే.. మోడీతో తెగ తెంపులు చేసుకున్న త‌ర్వాత‌.. నీతి అయోగ్ స‌మావేశం కార‌ణంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌ధాని భేటీ కానున్నారు. బీజేపీతో క‌టీఫ్ త‌ర్వాత జ‌ర‌గ‌నున్న ఈ మీటింగ్ లో బాబు.. మోడీల వ్య‌వ‌హార‌శైలి ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది.