Begin typing your search above and press return to search.

ఆ లేడీ సీఎంకు హార్ట్ అటాక్ తెప్పిస్తున్న మోడీ?

By:  Tupaki Desk   |   2 Dec 2016 7:01 AM GMT
ఆ లేడీ సీఎంకు హార్ట్ అటాక్ తెప్పిస్తున్న మోడీ?
X
పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బెదిరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆమెకు ప్రాణభయం - అధికార భయం రెండూ కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందుకు ఊతమిస్తున్నాయి. నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ మోడీపై విమర్శలు కురిపిస్తున్న మమత బెనర్జీ రెండు రోజులు కిందట మరింత తీవ్రంగా మాట్లాడుతూ మోడీని దేశ రాజకీయాల్లో కనిపించకుండా చేస్తానని ప్రతిన పూనారు. అది జరిగిన రెండు రోజులకే... మమత బెనర్జీ పాట్నా నుంచి కోల్ కతాకు విమానంలో రాగా కోల్ కతా ఎయిర్ పోర్టులో ఆమె ఉన్న విమానం దిగడానికి అధికారులు అనుమతి ఇవ్వకుండా గంట పాటు గాల్లోనే తిప్పి ఆ తరువాత ల్యాండింగ్ కు పర్మిషన్ ఇచ్చారు. దీనిపై పార్లమెంటులోనూ తృణమూల్ సభ్యుల ఆరోపణలు చేశారు. మమతను చంపేందుకే అలా కుట్ర పన్నారని వారు అనుమానిస్తున్నారు. కాగా ఈ టెన్షన్ ఇంకా పూర్తిగా తీరకముందే ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా బెంగాల్ లో సైన్యాన్ని మోహరించింది కేంద్రం. దీంతో మోడీ మమతకు కంటిమీద కునుకు లేకుండా చేయాలనే ఇలా చేస్తున్నారంటున్నారు. నిజానికి విమానం ల్యాండింగ్ కాకపోయినా ఏమాత్రం బెదరని మమత సైన్యం వచ్చిన బెంగాల్లోని అన్ని టోల్ ప్లాజాల్లో తిష్ఠ వేసేసరికి తీవ్రంగా టెన్షన్ పడ్డారు. రాత్రంతా సెక్రటేరియట్ లోనే ఉండి అక్కడి నుంచి పరిస్థితి సమీక్షించారు.

పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాధీనంలోని ప్రధాన టోల్‌ ప్లాజాలు - బ్రిడ్జిల వద్ద ఆర్మీ మోహరించడంతో ఏం జరుగుతోందో... అసలు కేంద్రం ఉద్దేశం ఏమిటో అర్థం కాక ఆమె ఆందోళన చెందారు. సైన్యాన్ని టోల్ ప్లాజాల నుంచి ఉపసంహరించాలని మమత డిమాండు చేయడంతో వారిని తొలగించారు. అయితే... ఆమె మాత్రం సెక్రటేరియట్ లోనే రాత్రంతా ఉన్నారు. ''ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. వాళ్లను అభద్రతా భావంలో వదిలేసి నేను వెళ్లలేను. రాత్రంతా ఇక్కడే ఉండి పరిస్థితిని పరిశీలిస్తాను'' అని అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఆమె ప్రకటన చేశారు. సైన్యం ఎక్కడైనా మాక్ డ్రిల్ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని, కానీ వాళ్లు ఏకంగా ఇక్కడ మోహరించినా అనుమతి తీసుకోలేదని చెప్పారు.

అయితే... సైన్యాధికారులు మాత్రం దీనిపై భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా సైన్యం ఏడాదికి రెండుసార్లు ఇలాంటి ఎక్సర్‌ సైజులు చేస్తుందని, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే అందుబాటులో కావాల్సిన లోడ్ క్యారియర్ల గురించి లెక్కలు తీసి సిద్ధంగా ఉంచుకుంటుందని, ఇక్కడ కూడా అందుకోసమే సైన్యం వచ్చింది తప్ప.. వేరే ఉద్దేశం లేదని చెబుతోంది. ఏదైనా ప్రాంతం గుండా నిర్దేశిత సమయంలో ఎన్ని వాహనాలు వెళ్తున్నాయో లెక్క చూస్తామని, అత్యవసర సమయంలో అక్కడ వాహనాలు ఆగిపోతే ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేస్తామని సైన్యం చెబుతోంది. పశ్చిబెంగాల్ పోలీసులకు పూర్తి సమాచారం అందించిన తర్వాతే సైన్యం ఇక్కడకు వచ్చిందని.. టోల్ ప్లాజాలను ఆర్మీ స్వాధీనం చేసుకుందంటూ వచ్చిన ఆరోపణలు సరికావని ఈస్ట్రన్ కమాండ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.

మరోవైపు బెంగాల్ తో పాటు అసోంలోని 18 ప్రాంతాలు - అరుణాచల్‌ ప్రదేశ్‌ లో 13 ప్రాంతాలు - పశ్చిమ బెంగాల్‌ లో 6 - నాగాలాండ్‌ లో 5 - మేఘాలయలో 5 - త్రిపుర - మిజొరాంలలో ఒక్కో ప్రాంతంలో ఈ ఎక్సర్‌ సైజులు జరుగుతున్నాయని సైన్యం చెబుతోంది. అయితే... కోల్‌ కతా పోలీసులు మాత్రం సైన్యం ఇక్కడకు రావడం వల్ల ట్రాఫిక్ సమస్య - భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తాయని అంటున్నారు. అయితే... టోల్ ప్లాజాలతో పాటు సెక్రటేరియట్ ప్రాంతంలో సైన్యం మోహరించడంతో మమత తీవ్రంగా ఆందోళన చెందినట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/