Begin typing your search above and press return to search.

మోడీ సర్కార్‌ ను ఇరుకున పెడుతున్న దీదీ!

By:  Tupaki Desk   |   23 Sep 2015 3:44 AM GMT
మోడీ సర్కార్‌ ను ఇరుకున పెడుతున్న దీదీ!
X
నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కు సంబంధించిన ఫైళ్లు వాటిద్వారా ప్రభుత్వాలు, పార్టీలు ఇరుకున పడే ప్రమాదం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణానికి సంబంధించి.. అనేక రహస్యాలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయని.. ప్రపంచం మొత్తం విశ్వసిస్తూ ఉంది. దీనికి సంబంధించి కొన్ని కఠోర వాస్తవాలను వెల్లడించే ఫైళ్లు ప్రభుత్వం వద్ద ఉన్నాయనేది పలువురి విశ్వాసం. అయితే గద్దె మీద ప్రభుత్వాలు మారుతూ వస్తున్నా సరే.. ఆ ఫైళ్లను మాత్రం.. బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అలాంటిది.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వద్ద ఉన్న కొన్ని ఫైళ్లను బయటపెట్టేయడం ద్వారా.. మమతా బెనర్జీ కేంద్రాన్ని ఇరుకున పడేసినట్లు కనిపిస్తోంది.

పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం వద్ద ఉన్న నేతాజీ ఫైళ్లను బహిరంగం చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించినప్పుడు చాల మంది హర్షించారు. కేంద్రప్రభుత్వం పెద్దలు వెంకయ్యనాయుడు లాంటి వారు కూడా అభినందించారు. అయితే.. ఆ నిర్ణయం ముందు ముందు తమ మెడకు చుట్టుకుంటుందని వారు ఊహించి ఉండకపోవచ్చు. తీరా మమతాదీదీ ఫైళ్లు బయటపెట్టేసిన తర్వాత.. అందులో.. అసలు రహస్యాలు ఏమీ లేవనే సంగతి తేలింది.

ఇక ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులోకి మళ్లింది. నేతాజీ మరణం గురించి చాలా రహస్యాలు తెలుస్తాయని అనుకున్న జనం.. ఈ ఫైళ్లతో తృప్తి చెందక కేంద్రంకూడా తమ వద్ద ఉన్న ఫైళ్లు వెల్లడిస్తుందని ఆశగా చూస్తున్నారు. ఏకంగా సీఎం మమతా బెనర్జీ కూడా కేంద్రాన్ని ఇదే డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రం కూడా తమ లాగా ఫైళ్లు వెల్లడించాలని అంటున్నారు. మమత డిమాండుకు విశ్వహిందూ పరిషత్‌ గళం కలిపింది. ఆమెను అభినందిస్తూనే..కేంద్రం కూడా వెల్లడించాలని అంటోంది. అంటే.. కాషాయదళం దీనికి అనుకూలంగా కదులుతున్నదన్నమాట. నేడో రేపో ఆరెస్సెస్‌కూడా నేతాజీ ఫైళ్లు బయటపెట్టాలని కోరే అవకాశం ఉంది. అంటే క్రమంగా మోడీ సర్కారు ఇరుకున పడుతున్నదని అర్థమవుతోంది. నిజానికి అప్పటి ఫైళ్ల వలన మోడీ సర్కారు మీద పడబోయే చెడు ముద్ర అంటూ ఏదీ ఉండదు గానీ.. రహస్యపత్రాలుగా పరిగణించిన వాటిని బయటపెట్టడం అనేది.. ఎలాంటి చర్య కిందికి వస్తుందో వారు లెక్కవేసుకోవాలి.