Begin typing your search above and press return to search.

ఏడాదిలో అందరికి టీకా.. మోడీ సర్కార్ ను ఉతికేసిన దీదీ

By:  Tupaki Desk   |   4 Jun 2021 2:54 AM GMT
ఏడాదిలో అందరికి టీకా.. మోడీ సర్కార్ ను ఉతికేసిన దీదీ
X
ఎన్నికల వేళలోనే రాజకీయాలు. ఆ తర్వాత అంతా పాలన మీదనే ఫోకస్ అంటూ చెప్పే మాటలకు.. చేసే పనులకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో వ్యవహరించే మోడీ సర్కార్ పైన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ తనకు ఎదురైన అనుభవాలు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో తనకు ఎదురైన ఇబ్బందులు.. చోటు చేసుకున్న పరిణామాలతో కేంద్రంపై మమతమ్మ మహా కోపంగా ఉన్నారు. అసలే మొండి.. మోడీ పుణ్యమా అని ఇప్పుడు మహా మొండిగా తయారయ్యారు. ఏ చిన్న ఛాన్సు చిక్కినా కేంద్రంలోని మోడీ సర్కారుపై ఒంటికాలి మీద లేస్తూ తానేమిటో చూపిస్తున్నారు.

మొన్నటికి మొన్న బెంగాల్ కు వచ్చి రివ్యూ పెట్టిన ప్రధాని మోడీకి ఊహించని షాకిచ్చారు దీదీ. ఆమె తీరు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. మోడీ భక్తులకు.. అభిమానులకు ఆమె ఇప్పుడో విలన్ గా కనిపిస్తున్నా.. మోడీని వ్యతిరేకించే వారికి మాత్రం ఆమె ఒక జేమ్స్ బాండ్ లా మారారు. ఏమైనా సరే.. తాను అనుకున్నది మాత్రమే చేసే లక్షణం ఉన్న మమత.. రాజ్యాంగపరమైన అంశాల్ని.. గౌరవ మర్యాదల్ని పూర్తిగా పక్కన పెట్టేశారన్న విమర్శ వినిపిస్తోంది.

మోడీ లాంటి మొండిఘటాన్ని ఎదుర్కోవటానికి ఆ మాత్రం ఉండాల్సిందేనన్న సమర్థింపు కొందరి నోట వినిపిస్తోంది. మొత్తంగా మోడీ సర్కార్ వర్సెస్ మమత సర్కారు మధ్య ఉప్పు నిప్పులాంటి పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేస్తోంది. దేశంలోని 18 ఏళ్లు నిండిన వారందరికి ఏడాది చివరికి టీకాలు పూర్తి చేస్తామని చెబుతోంది. దీనిపై తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ స్పందించారు.

కేంద్రం చెబుతున్న మాటలన్ని ఉత్త బూటకంగా అభివర్ణించారు. కేంద్రం అలానే చెబుతుందని.. బిహార్ ఎన్నికలకు ముందు ఇలానే చెప్పారని.. తాము పవర్లోకి వస్తే ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని.. కానీ అక్కడ అలాంటిదేమీ లేదే? అని ప్రశ్నించారు. ఇప్పుడున్న టీకాల మధ్య వ్యవధి ప్రకారమైతే అర్హులైన వారందరికి వ్యాక్సిన్ వేయాలంటే కనీసం ఆర్నెల్ల నుంచి ఏడాది వరకు పడుతుందన్నారు. తమ రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.150 కోట్లు ఖర్చు చేస్తే కేవలం రూ.1.4 కోట్ల డోసులే వచ్చాయని ఆమె చెబుతున్నారు. ఫైనల్ గా రాష్ట్రాలకు కేంద్రమే ఉచితంగా టీకాలు పంపిణీ చేయాలన్న డిమాండ్ చేశారు. మరి.. టీకా పంపిణీపై మమత ఆగ్రహావేశాలకు మోడీ సర్కారు ఎలా రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.